‘అభిశంసనల’ నుంచి ట్రంప్‌నకు విముక్తి

తనపై వచ్చిన అభిశంసన అభియోగాల నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు విముక్తి లభించింది. అధికార రిపబ్లికన్‌ పార్టీ ఆధిక్యంలో ఉన్న సెనెట్‌ అధ్యక్షుడిపై అభియోగాలను తోసిపుచ్చింది. ట్రంప్‌ అధికార

Published : 06 Feb 2020 10:30 IST

వాషింగ్టన్‌: తనపై వచ్చిన అభిశంసన అభియోగాల నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు విముక్తి లభించింది. అధికార రిపబ్లికన్‌ పార్టీ ఆధిక్యంలో ఉన్న సెనెట్‌ అధ్యక్షుడిపై అభియోగాలను తోసిపుచ్చింది. ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగం 52-48 ఓట్ల తేడాతో వీగిపోయింది. అమెరికన్‌ కాంగ్రెస్‌ విధులకు ఆటంకం కలిగించారనే మరో అభియోగం 53-47 ఓట్ల తేడాతో వీగిపోయింది. 

రేపు స్పందిస్తా: ట్రంప్‌

కాగా.. అభిశంసన తీర్మానం వీగిపోవడంపై రేపు అధికారికంగా స్పందిస్తానని అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. ‘అభిశంసనపై మన దేశం విజయం సాధించింది. దీనిపై గురువారం మధ్యాహ్నం 12.00 గంటలకు(అమెరికా కాలమానం ప్రకారం) శ్వేతసౌధం నుంచి అధికారిక ప్రకటన చేస్తా’ అని ట్రంప్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. 

2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు డెమోక్రటిక్‌ నేత జోయ్‌ బిడెన్‌ నుంచి గట్టి పోటీ ఉంది. ఈ నేపథ్యంలో బిడెన్‌ను దెబ్బకొట్టేందుకు ట్రంప్‌ ఉక్రెయిన్‌ సాయం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం అందిస్తానన్న ట్రంప్‌.. అందుకు ప్రతిఫలంగా బిడెన్‌, ఆయన కుమారుడిపై అవినీతి కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఆ దేశంపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. జోయ్‌ బిడెన్ కుమారుడు హంటర్‌కు ఉక్రెయిన్‌లో వ్యాపారాలున్నాయి. ఈ విషయమై ఆ దేశ అధ్యక్షుడితో ట్రంప్‌ మాట్లాడిన ఫోన్‌ కాల్‌ పై అమెరికా నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో ఆయనపై అభిశంసనకు డెమోక్రాట్లు పట్టుబట్టారు.

దీంతో గతేడాది డిసెంబరు 18న ప్రతినిధుల సభ ట్రంప్‌పై అభిశంసన అభియోగాన్ని మోపింది. డెమోక్రాట్లు ఆధిక్యంలో ఉన్న ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఈ తీర్మానం.. సెనెట్‌కు చేరింది. తాజాగా సెనెట్‌లో దీనిపై ఓటింగ్‌ జరపగా.. అధికార రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు ట్రంప్‌నకు మద్దతుగా నిలిచారు. దీంతో ఆయనపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని