పారిశుద్ధ్య కార్మికులపై టాటా భావోద్వేగ పోస్ట్‌

మనం ఛీ అని పారేసే చెత్తను చేతులతో ఎత్తుతారు వారు.. మన ఆరోగ్యం కోసం వారి ప్రాణాలను పణంగా పెడతారు.. అలాంటి వారికి మన దేశంలో సరైన గౌరవం దక్కుతుందా..? కనీసం వారి పనిని గుర్తించే గొప్ప మనసు మనకుందా..?

Published : 18 Feb 2020 16:17 IST

ముంబయి: మనం ఛీ అని పారేసే చెత్తను చేతులతో ఎత్తుతారు వారు.. మన ఆరోగ్యం కోసం వారి ప్రాణాలను పణంగా పెడతారు.. అలాంటి వారికి మన దేశంలో సరైన గౌరవం దక్కుతుందా..? కనీసం వారి పనిని గుర్తించే గొప్ప మనసు మనకుందా..? ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా షేర్‌ చేసిన తాజా వీడియో మనలో ఇలాంటి ప్రశ్నలే రేకెత్తిస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల గురించి ఆలోచింపజేస్తోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటీ.. ఎందుకు పోస్ట్‌ చేశారు..?

పారిశుద్ధ్య కార్మికుల కోసం ‘మిషన్‌ గరిమా’ పేరుతో టాటా ట్రస్ట్‌ ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రతన్‌ టాటా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పారిశుద్ధ్య కార్మికులపై ఓ భావోద్వేగ యాడ్‌ను పోస్ట్‌ చేశారు. ఇందులో ఓ విద్యార్థి స్కూల్‌ పోటీల్లో భాగంగా తన తండ్రి గురించి ప్రసంగిస్తాడు. ‘మా నాన్న ఈ దేశాన్ని నడిపిస్తాడు. ఆయన రాజకీయ నాయకుడు కాదు. డాక్టర్‌ కాదు. పోలీస్‌ కాదు. కనీసం జవాన్‌ కూడా కాదు. కానీ ఆయనే లేకపోతే దేశం ఆగిపోతుంది. మా నాన్న ఒక్క రోజు పనికి వెళ్లకపోయినా పత్రి ఇంట్లో పనులు ఆగిపోతాయి. ఏ తండ్రి చేయని పని మా నాన్న చేస్తున్నారు. ఈ దేశంలో ఒక్కరు కూడా తడి, పొడి చెత్తను వేరు చేయట్లేదు. అందువల్ల మా నాన్న లోతైన మ్యాన్‌హోల్‌లోకి దిగి వాటిని బయటకు తీయాల్సి వస్తోంది. రోగాలను కూడా పట్టించుకోకుండా ఈ పనిచేస్తున్నారు. కొన్ని సార్లు ఈ రోగాల వల్ల మా నాన్న తిరిగి ప్రాణాలతో ఇంటికి వస్తారో లేదో అని మేం భయపడుతూనే ఉంటాం’ అని ఆ బాలుడు చెబుతూ ఉంటే అక్కడున్న అందరి కళ్లు చెమర్చుతాయి. 

ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ రతన్‌ టాటా ఇలా రాసుకొచ్చారు. ‘2.3 కోట్ల మంది జనాభా ఉన్న ముంబయి మహా నగరంలో 50వేల మంది పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. ముంబయి ప్రజలు వేసే చెత్తను ఏరివేసి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వారు ప్రతి రోజు అత్యంత కఠినమైన పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. అలాంటి పారిశుద్ధ్య కార్మికులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన పని వాతావరణం కల్పించేందుకు  టాటా ట్రస్ట్‌ ‘మిషన్‌ గరిమా’ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా టూ బిన్స్‌ లైఫ్‌విన్స్‌ పేరుతో ఓ క్యాంపెయిన్‌ ప్రారంభించాం. పారిశుద్ధ్య కార్మికులకు భారం తగ్గించేలా తడి, పొడి చెత్తను వేరు చేద్దాం’ అని టాటా పిలుపునిచ్చారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని