
‘ఖేలో ఇండియా’ అథ్లెట్లకు సరైన వేదిక: మోదీ
దిల్లీ: దేశంలోనే తొలిసారిగా ‘ఖేలో ఇండియా’ యూనివర్శిటీ క్రీడా పోటీలను శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఒడిశాలోని జవహార్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ క్రీడలను మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఒడిశా ఈ రోజు కొత్త చరిత్రకు వేదికైందన్నారు. భవిష్యత్తులో భారత క్రీడా రంగానికి ఇది గొప్ప ముందడుగుగా పేర్కొన్నారు. ఈ పోటీలు అథ్లెట్లకు తమ కలల్ని నెరవేర్చుకునేందుకు మంచి వేదిక అని అన్నారు. అథ్లెట్లు ఈ పోటీల ద్వారా నైపుణ్యాల్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంది అన్నారు. వీటి ద్వారా ప్రతిభ ఉన్న కొత్త క్రీడాకారులు వెలుగులోకి వస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.
పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా జవహార్లాల్ నెహ్రూ స్టేడియానికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, ధర్మేంద్ర ప్రధాన్, క్రీడాశాఖ కార్యదర్శి రాధే శ్యామ్ తదితరులు హాజరయ్యారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న 159 యూనివర్శిటీల నుంచి 3400 మంది అథ్లెట్లు పాల్గొననున్నారు. వీరంతా రగ్బీ సహా మొత్తం 17 క్రీడల్లో పోటీ పడనున్నారు.
Advertisement