భారత్‌తో భాగస్వామ్యం మరింత బలపడింది

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భారత్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటన అమెరికా-భారత మధ్య ఉన్న భాగస్వామ్య విలువలను ప్రదర్శించిదని అమెరికా.....

Published : 28 Feb 2020 11:57 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భారత్ పర్యటనను విజయవంతంగా ముగించుకొని వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పర్యటన అమెరికా-భారత మధ్య ఉన్న భాగస్వామ్య విలువలను ప్రదర్శించిందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో అన్నారు. తాజాగా ఆయన ట్రంప్ పర్యటనపై ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘‘భారత్‌లో ఈ వారం జరిగిన ట్రంప్‌ మొదటి అధికారిక పర్యటన అమెరికా-భారత్ భాగస్వామ్య విలువలను ప్రదర్శించింది’’ అని అన్నారు. ‘‘ప్రజాస్వామ్య సంప్రదాయాలు మనల్ని ఒక్కటి చేస్తాయి, ఆలోచనల భాగస్వామ్య  బంధాలు మనల్ని కలుపుతాయి, అధ్యక్షుడి నాయకత్వంలో మన భాగస్వామ్యం మరింత బలపడుతుంది’’ అని ట్రంప్‌ భారత పర్యటనను ఉద్దేశించి వైట్ హౌస్‌ చేసిన ట్వీట్‌ని ఆయన రీట్వీట్‌ చేశారు. ‘‘భారత్‌తో మా భాగస్వామ్యాన్ని మరింత ధృడ పరుచుకొంటాం. ఒకేరకమైన ప్రజాస్వామ్య సంప్రదాయాలు, స్వేచ్ఛ, వ్యక్తిగత హక్కులు, చట్ట పాలనను పరిరక్షించే రాజ్యాంగాల ద్వారా రెండు దేశాలు ఎల్లప్పుడూ ఐక్యంగా ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకుంటామని’’ వైట్ హౌస్‌ ట్వటర్లో పేర్కొంది.

ట్రంప్‌ పర్యటన ద్వారా అమెరికా- భారత్ మధ్య భాగస్వామ్యం అద్భుతమైన పురోగతి సాధించిదని అమెరికా ప్రతినిధి అలైస్‌ జీ వెల్స్‌ అన్నారు. ఇంధనం, రక్షణ, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు, ఇండో-పసిఫిక్ సమన్వయం వంటి ముఖ్య రంగాలలో మరింత సహకారానికి ఈ పర్యటన ఎంతగానో తోడ్పడిందని వెల్స్ చెప్పారు. అమెరికా-భారత్ ఇంధన భాగస్వామ్యంలో పెట్రోలియం, సౌర, పవన శక్తిని అభివృద్ధి చేయడానికి యుఎస్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 600 మిలియన్ డాలర్ల పెట్టుబడిని అందించే విషయంలో ఎంతో పురోగతి సాధించినట్లు వెల్లడించారు. ఏప్రిల్‌లో తమ దేశ ప్రతినిధులు, పార్లమెంట్ సభ్యుల ‘ఎక్స్ఛేంజ్‌ విజిట్’ జరగనుందని తెలిపారు. మానవ అంతరిక్ష ప్రయాణానికి భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. మరింత మంది భారత ఉన్నత స్థాయి విద్యార్థులను అమెరికాకు ఆహ్వానించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. దిల్లీ అల్లర్లపై స్పందిస్తూ అన్ని వర్గాల వారు శాంతిని పాటించి, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు కృషి చేయాలని వెల్స్ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని