కరోనా వల్ల చాలా మిస్సవుతున్నా: ట్రంప్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా (కొవిడ్-19) వైరస్‌ మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు 3 వేల మందికి పైగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యాన్ని వదలని ఈ ప్రాణాంతక వ్యాధి.....

Published : 05 Mar 2020 09:45 IST

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనావైరస్‌ (కొవిడ్-19) మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు దాదాపు మూడువేల మంది మరణించిన సంగతి తెలిసిందే. అగ్రరాజ్యాన్ని వదలని ఈ ప్రాణాంతక వ్యాధి కారణంగా కొన్ని వారాలుగా తన ముఖాన్ని తాకట్లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తెలిపారు. వైట్ హౌస్‌లో కరోనా వైరస్‌ వ్యాపించకుండా తీసుకొంటున్న చర్యలపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా సోకకుండా తీసుకొనే జాగ్రత్తల్లో భాగంగా ‘‘కొన్ని వారాలుగా నేను నా ముఖాన్ని తాకలేదు. దాన్ని  నేను చాలా మిస్సవుతున్నాను’’ అని చమత్కరించారు.    

తాజాగా కరోనాపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా స్పందించారు. ‘‘ప్రజలంతా ముందు జాగ్రత్త చర్యగా చేతులను శుభ్రం చేసుకోవాలని, మాస్కులను ధరించవద్దని అన్నారు. మాస్కుల కొరత ఉన్న కారణంగా వాటిని వైద్య సిబ్బంది కోసం ఆదా చేయాలని సూచించారు. ప్రశాంతంగా ఉండి, నిపుణుల సలహాలు పాటించాలని’’ ట్వీట్‌ చేశారు. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మాస్కులు, కళ్ల అద్దాలు, రక్షణగా ధరించే గౌన్ల కొరత తీవ్రంగా ఉందని, వాటి ఉత్పత్తి పెంచాలని ప్రపంచ దేశాలకు సూచించింది. తాజాగా అమెరికాలో కరోనా మృతుల సంఖ్య 11కి చేరింది. ఈ వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు అమెరికా ఎనిమిది బిలియన్ డాలర్లను కేటాయించింది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యగా ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తన ఉద్యోగులందరినీ మార్చి 25 వరకు ఇళ్ల నుంచే పనిచేయాలని కోరింది. వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న యూరప్‌, ఆసియా దేశాలకు ఉద్యోగులు అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయాలని సూచించింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని