జమ్మూలో ఇద్దరికి అధిక వైరల్‌ లోడ్‌!

కరోనా వైరస్‌ సోకినట్లుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులు జమ్మూలో చికిత్స పొందుతున్నట్లు అక్కడి పాలనా యంత్రాంగం వెల్లడించింది. తొలిదశ పరీక్షల్లో వైరల్‌ లోడ్‌ తీవ్రత అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు.......

Updated : 07 Mar 2020 14:57 IST

జమ్మూ: కరోనా వైరస్‌ సోకినట్లుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులు జమ్మూలో చికిత్స పొందుతున్నట్లు అక్కడి పాలనా యంత్రాంగం వెల్లడించింది. తొలిదశ పరీక్షల్లో వైరల్‌ లోడ్‌ తీవ్రత అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. తదుపరి పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చే అవకాశం అధికంగా ఉందని ఓ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉంచిన వారిపై వైద్య పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. వీరిలో ఒకరు గతంలో ఇటలీకి, మరొకరు దక్షిణ కొరియాకు వెళ్లొచ్చినట్లు తెలిసిందన్నారు. తొలుత వీరు ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డు నుంచి పారిపోయారని.. ఎట్టకేలకు తిరిగి పట్టుకున్నామన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో జమ్ము, సాంబా జిల్లాల్లో అన్ని ప్రాథమిక పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అలాగే జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా ఉద్యోగులకు ‘బయోమెట్రిక్‌ హాజరు విధానం’ నుంచి మినహాయింపు కల్పించారు. జమ్మూకశ్మీర్‌లో దాదాపు 200 మంది ఇటీవల వైరస్‌ ప్రభావిత దేశాలకు వెళ్లొచ్చినట్లు గుర్తించిన కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 25 మందిని పరీక్షించగా.. ఒక్కరికి కూడా పాజిటివ్‌ రాలేదు. మరోవైపు ఇటీవల ఇటలీకి వెళ్లొచ్చిన ఇద్దరు అమృత్‌సర్‌ వాసులకు కూడా వైరస్‌ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ప్రాథమిక పరీక్షల్లో వైరల్‌ లోడ్‌ తీవ్రత అధికంగా ఉన్నట్లు గుర్తించామని గురునానక్‌ దేవ్‌ వైద్యులు తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు 31 మందిలో వైరస్‌ ఉన్నట్లు నిర్ధారించిన విషయం తెలిసిందే.      

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని