ట్రంప్‌ కరోనా పరీక్షలు చేయించుకున్నారా..?

 అగ్రరాజ్యం అమెరికా కూడా వైరస్‌తో వణికిపోతోంది. ఏకంగా అధ్యక్షుడు ట్రంపే కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే దీనిపై స్పందించిన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ అధ్యక్షుడి.........

Updated : 10 Mar 2020 12:00 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా కూడా కరోనా వైరస్‌(కొవిడ్‌-19)తో వణికిపోతోంది. ఏకంగా అధ్యక్షుడు ట్రంపే కరోనా వైద్య పరీక్షలు చేయించుకున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనిపై స్పందించిన శ్వేతసౌధం అధ్యక్షుడు ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోలేదని స్పష్టం చేసింది. ఆయనలో ఎలాంటి వైరస్‌ లక్షణాలు లేవని.. కరోనా పరీక్షలు చేయించాల్సిన అవసరం కూడా లేదని శ్వేతసౌధం అధికార ప్రితినిధి స్టెఫానీ గ్రిషమ్‌ తెలిపారు. ట్రంప్‌ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు. అయినా.. వ్యక్తిగత వైద్యుడు అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా సమీక్షిస్తుంటారని పేర్కొన్నారు. అంతకుముందు ట్రంప్‌ ఓ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అమెరికా ప్రజలను కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ సైతం ఎలాంటి కుదుపులకు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. 
అంతకుముందు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ అధ్యక్షుడి వైద్య పరీక్షలపై తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. శ్వేతసౌధం వైద్యాధికారి నుంచి ప్రకటన వస్తేనే నిర్ధారించగలమని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పలు సమావేశాల్లో కరోనా సోకిన ఇద్దరు ప్రతినిధులు ట్రంప్‌ని కలిశారన్న వార్తల నేపథ్యంలో అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే అధ్యక్షుడిని కలిసినప్పుడు వారికి వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. వీలైనంత త్వరగా ట్రంప్‌ వైద్య పరీక్షలపై శ్వేతసౌధం నుంచి సమాధానం వచ్చేలా చూస్తామని పెన్స్‌ తెలిపారు. అలాగే తాను మాత్రం ఇప్పటివరకు ఎలాంటి పరీక్షలు చేయించుకోలేదని పెన్స్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో శ్వేతసౌధం ప్రకటన వెలువడడంతో ట్రంప్‌ కరోనా పరీక్షలపై అనుమానాలు వీడాయి.  మరోవైపు కాలిఫోర్నియా తీరంలో నిలిపి ఉంచిన ‘గ్రాండ్‌ ప్రిన్సెస్‌’ నౌక నుంచి తొలి ప్రయాణికుల బృందాన్ని బయటకు తీసుకొచ్చారు. వారిని వైద్య పర్యవేక్షణలో ఉంచనున్నారు. మరో 900 మందిని ఈరోజు విడుదల చేస్తారని సమాచారం. మొత్తం అందులో 3500 మంది ఉన్నారు. అమెరికాలో వైరస్‌ వల్ల ఇప్పటి వరకు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 514 మంది కరోనా బాధితులుగా మారారు.

ఇదీ చదవండి..

ఆ దేశం మొత్తం నిర్బంధంలో..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని