
గాడ్సే నుంచి నిర్భయ దోషుల వరకు..
దిల్లీ: ప్రపంచంలో అత్యంత ఘోరమైన నేరాల్లో ఒకటైన నిర్భయ కేసులో ఎట్టకేలకు దోషులకు శిక్ష అమలైంది. దోషులైన ముకేశ్ సింగ్, పవన్ గుప్త, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్‌ను తిహాడ్ జైలులో ఈరోజు ఉదయం 5:30గంటలకు ఉరి తీశారు. ఇలా నలుగురికీ ఒకేసారి మరణ దండన విధించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. దీంతో ఉరిశిక్ష సమంజసమేనా.. కాదా.. అన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మన దేశంలో ఉరిశిక్ష అమలు చరిత్రను ఓ సారి చూద్దాం..
ఇటీవలి ఉరిశిక్షలు..
నిర్భయ దోషుల కంటే ముందు 2015లో చివరిసారి ఉరిశిక్షను అమలు చేశారు. 1993 ముంబయి పేలుళ్లలో కీలక పాత్ర పోషించిన యాకూబ్ మెమన్ను 2015 జులై 30న నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉరికంబం ఎక్కించారు. అంతకుముందు పార్లమెంటుపై దాడికి కుట్రపన్నిన అఫ్జల్ గురును 2013, ఫిబ్రవరి 8న తిహాడ్ జైలులో ఉరితీశారు. 2008లో ముంబయి ఉగ్రదాడిలో పట్టుబడ్డ ముష్కరుడు అజ్మల్ కసబ్‌ను 2012, నవంబరు 12న ఉరి తీశారు. 2004లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేలిన ధనుంజయ్ ఛటర్జీకి మరణ శిక్ష అమలు చేశారు. అంతకుముందు వరుస హత్యలకు పాల్పడ్డ ఆటో శంకర్ అలియాస్ గౌరీ శంకర్‌ను 1995లో ఉరితీశారు. గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన నాథూరామ్ గాడ్సేను 1949లో దేశంలో మొట్టమొదటిసారి ఉరితీశారు. ఈ కేసులో కుట్రదారుడు నారాయణ్ ఆప్టేకి కూడా మరణ శిక్ష అమలు చేశారు. అనంతరం 1989లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య కేసులో దోషులు సత్వంత్ సింగ్, ఖేహర్ సింగ్‌ను ఉరి వేశారు.
ఇప్పటి వరకు ఎంతమందికి...
దిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ(ఎన్ఎల్యూ) సేకరించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో 755 మందిని ఉరితీశారు. అయితే ఈ సంఖ్య ఎక్కువే ఉండే అవకాశం ఉందన్న వాదనా ఉంది. చాలా జైళ్లలో ఉరికి సంబంధించిన రికార్డులు లేకుండా పోవడంతో సంఖ్యపై అస్పష్టత ఏర్పడిందని ఎన్ఎల్యూ ఓ సందర్భంలో తెలిపింది. దీంతో ప్రతి జైలుని సంప్రదించి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించింది. ఎన్ఎల్యూ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు అత్యధిక మరణ శిక్షలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేశారని తెలుస్తోంది.
ఏయే నేరాలకు మరణశిక్ష..
హత్య, హత్యాయత్నం, హత్యాచారం, సామూహిక అత్యాచారం, దేశద్రోహం, సైన్యంలో తిరుగుబాటు, మాదక ద్రవ్యాల సరఫరా వంటి తీవ్ర నేరాలకు భారత్‌లో మరణ దండన విధిస్తున్నారు. దేశంలో భారత శిక్షా స్మృతి(ఐపీసీ) వివిధ సెక్షన్ల కింద వీటిని విధించవచ్చు. మరణ శిక్షకు అవకాశం గల మరో 24 కేంద్ర, రాష్ట్ర చట్టాలు కూడా ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం పౌరులందరికీ జీవించే హక్కు ఉంది. దీనికి భంగం కలిగించే ప్రయత్నాలు చేయడమే ఉరిశిక్షకు ప్రామాణికం.