
కరోనా లక్షణాలతో భారత సంతతి శాస్త్రవేత్త మృతి
జోహనెస్‌బర్గ్: భారత సంతతికి చెందిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైరాలజిస్ట్ కరోనా లక్షణాలతో దక్షిణాఫ్రికాలో మరణించారు. వాక్సిన్ శాస్త్రవేత్త, హెచ్‌ఐవీపై పరిశోధకురాలు ప్రొఫెసర్ గీతా రామ్‌జీ(50) దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డారు. తాజాగా ఆమె కరోనా వైరస్ కారణంగా కన్నుమూసినట్లు అధికారులు ప్రకటించారు. గతవారం క్రితమే గీతా రామ్‌జీ లండన్ నుంచి దక్షిణాఫ్రికా చేరుకున్నారు. అనంతరం అనారోగ్యానికి గురైన ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. కొవిడ్-19 సంబంధిత లక్షణాలకు చికిత్స పొందుతూ గీతా రామ్‌జీ మరణించారని దక్షిణాఫ్రికా వైద్య పరిశోధన మండలి(ఎస్‌ఏఎంఆర్‌సీ) ప్రకటనలో పేర్కొంది. గీతా రామ్‌జీ అకస్మాత్తు మరణం తమను ఎంతగానో కలచివేసిందని ఎస్‌ఏఎంఆర్‌సీ అధ్యక్షుడు గ్లెండా గ్రే పేర్కొన్నారు.
ప్రస్తుతం గీతా రామ్‌జీ దక్షిణాఫ్రికా వైద్యపరిశోధన మండలి(ఎస్‌ఏఎంఆర్‌సీ)లోని క్లినికల్ ట్రయల్స్ విభాగంలో ముఖ్య పరిశోధకురాలిగా సేవలు అందిస్తున్నారు. అంతేకాకుండా హెచ్‌ఐవీ నిర్మూలనపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనలకుగాను ఆమె ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంతోపాటు ఎన్నో అవార్డులను సొంత చేసుకున్నారు. యూరోపియన్ క్లినికల్ ట్రయల్స్ భాగస్వామ్యాభివృద్ధి సంస్థ(ఈడీసీటీపీ)2018లో గీతాను ‘అసాధారణ మహిళా శాస్త్రవేత్త’ అవార్డుతో సత్కరించింది. హెచ్‌ఐవీ నిర్మూలనలో సరికొత్త పద్ధతులను కనిపెట్టినందుకు ఈ సత్కారం లభించింది. అంతేకాకుండా హెచ్‌ఐవీ కారణంగా దక్షిణాఫ్రికా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గీతా రామ్‌జీ కృషి చేశారు. దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డ భారత సంతతికే చెందిన ఫార్మసిస్ట్ ప్రవీణ్ రామ్‌జీని వివాహం చేసుకున్నారు.
ఇప్పటికే దక్షిణాఫ్రికాలో కొవిడ్-19కారణంగా ఐదుగురు మరణించగా భారత సంతతికి చెందిన తొలికేసు ఇదే. ఇప్పటివరకు ఆ దేశంలో 1350 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తీవ్రత ఎక్కువగా ఉండడంతో దక్షిణాఫ్రికాలోనూ 21రోజులపాటు లాక్‌డౌన్ విధించింది అక్కడి ప్రభుత్వం.
ఇవీ చదవండి
‘కనీవినీ ఎరుగని సంక్షోభం ఎదుర్కోబోతున్నాం’