పౌర విమానయానశాఖ ఉద్యోగికి కరోనా!

దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా కేంద్ర విమానయాన శాఖ ఉద్యోగికి కొవిడ్‌-19 నిర్ధారణ అయినట్లు ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Published : 22 Apr 2020 23:55 IST

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా కేంద్ర విమానయాన శాఖ ఉద్యోగికి కొవిడ్‌-19 నిర్ధారణ అయినట్లు ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏప్రిల్‌ 15న విధులకు హాజరైన ఉద్యోగికి వైరస్‌ లక్షణాలు ఉండడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. తాజాగా అతనికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన దిల్లీ ప్రభుత్వం అతనితో సన్నిహితంగా ఉన్న సిబ్బందిని ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. సహోద్యోగులతోపాటు అతనితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలోపడ్డారు అధికారులు. దీంతో బుధవారం నాడు కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసిన అధికారులు శానిటైజ్‌ ప్రక్రియ చేపట్టారు. కరోనా వైరస్‌ బారినపడిన తమ ఉద్యోగికి పూర్తి వైద్య సహాయం అందించడంతోపాటు అన్నివిధాలా ఆదుకుంటామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి వెల్లడించారు. అతని ఆరోగ్యం తొందరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి నివాసం వద్ద పోలీసులకూ..

కరోనా వైరస్‌ మహమ్మారి మహారాష్ట్రను వణికిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే 5వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 251మంది మృత్యువాతపడ్డారు. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అధికారిక నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులకు ఈ వైరస్‌ సోకింది. మలబార్‌ హిల్‌ బంగ్లాలో ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసం వద్ద విధులు నిర్వహించిన మహిళా అసిస్టెంట్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌తోపాటు మరో పోలీసు సిబ్బందికి కరోనా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర పోలీసుశాఖ వెల్లడించింది. దీంతో ఆమెతో సన్నిహితంగా ఉన్న ఏడుగురు మహిళా పోలీసు అధికారులతోపాటు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను క్వారంటైన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యలో భాగంగా పైధోనీ పోలీస్‌ స్టేషన్‌లోని దాదాపు 60మంది పోలీస్‌ సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 49మంది పోలీసు సిబ్బంది కరోనా బారినపడినట్లు సమాచారం. 

ఇవీ చదవండి..

భారత్‌లో కరోనాతో 640 మంది మృతి..

కిమ్‌కేమైంది?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని