చైనా నవంబరులోనే వైరస్‌ను గుర్తించిందా?

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ విషయంలో చైనాపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న అమెరికా తాజాగా మరికొన్ని ఆరోపణలు చేసింది. చైనాకు ఈ మహమ్మారి గురించి నవంబరులోనే తెలిసి ఉంటుందని.....

Updated : 24 Apr 2020 10:10 IST

అగ్రరాజ్యం తాజా ఆరోపణలు

వాషింగ్టన్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ విషయంలో చైనాపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న అమెరికా తాజాగా మరికొన్ని ఆరోపణలు చేసింది. చైనాకు ఈ మహమ్మారి గురించి నవంబరులోనే తెలిసి ఉంటుందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆరోపించారు. అయినా, ప్రపంచ దేశాలకు చాలా నెమ్మదిగా తెలియజేసి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వ్యాఖ్యానించారు. డిసెంబరు రెండో వారం నాటికి వారి వద్ద పూర్తి సమాచారం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)కు కూడా చాలా ఆలస్యంగా సమాచారం తెలియజేశారని ఆరోపించారు.

ఊహాన్‌లో తొలుత వెలుగులోకి వచ్చిన సార్స్‌-కొవ్‌-2 వాస్తవ నమూనాలు సహా వైరస్‌కు సంబంధించిన చాలా సమాచారం అమెరికా ఇప్పటికీ కోరుతోందని పాంపియో అన్నారు. తద్వారా తొలినాళ్లలో వైరస్‌ విజృంభణకు సంబంధించిన సమాచారంతో పాటు ఇప్పుడు చేపట్టాల్సిన చర్యలపై కూడా ఓ అవగాహన ఏర్పడుతుందని తెలిపారు. ఇప్పటికీ ఈ మహమ్మారితో అమెరికాలో వేలాది మంది ప్రాణాల్ని కోల్పోతున్న విషయాన్ని గుర్తుచేశారు. 

‌‌ మహమ్మారిగా మారి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాల్ని హరిస్తున్న కరోనా వైరస్‌ గురించి మొట్టమొదటిసారి డిసెంబరు 31న చైనా అధికారికంగా ప్రపంచానికి తెలియజేసింది. వింత లక్షణాలున్న న్యూమోనియా కేసులు ఊహాన్‌లో నమోదవుతున్నట్లు వెల్లడించింది. అనంతరం జనవరి 4న డబ్ల్యూహెచ్‌ఓ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసిందని సంస్థ అత్యవసర విభాగం సంచాలకుడు మైఖేల్‌ ర్యాన్‌ తెలిపారు. ఆ తర్వాత రోజు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని యావత్తు ప్రపంచంతో పంచుకున్నట్లు పేర్కొన్నారు. కానీ, అమెరికా సహా మరికొన్ని దేశాలు ఈ విషయంలో చైనా, డబ్ల్యూహెచ్‌ఓ తీరుపై గుర్రుగా ఉన్నాయి. ప్రపంచాన్ని హెచ్చరించడంలో కావాలనే నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తున్నాయి.

 

ఇవీ చదవండి...

సూదికి పదును

ప్రయోగ దశలో అయిదు వ్యాక్సిన్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని