కరోనా: అంత్యక్రియల సమయంలో రాళ్ల దాడి!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ మరణించిన వారి అంత్యక్రియలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా అంత్యక్రియలు చేసే అధికారులు, సిబ్బందిపై దాడులకు దిగుతున్న సంఘటనలు విస్మయానికి గురిచేస్తున్నాయి.

Updated : 28 Apr 2020 12:46 IST

అంబాలా(హరియాణా): దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ మరణించిన వారి అంత్యక్రియలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా అంత్యక్రియలు చేసే అధికారులు, సిబ్బందిపై దాడులకు దిగుతున్న సంఘటనలు విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే పంజాబ్‌, తమిళనాడుతో పాటు మరికొన్ని చోట్ల ఇటువంటి ఘటనలు చోటుచేసుకోగా తాజాగా హరియాణాలో మరో సంఘటన జరిగింది. హరియాణాలోని అంబాలాకు చెందిన 60ఏళ్ల వృద్ధురాలు అస్తమాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. దీంతో అధికారులు ఆమెకు కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఫలితం రాకముందే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఈ సమయానికి వైద్యపరీక్షల ఫలితం రాకపోయినప్పటికీ కరోనా రోగికి అంత్యక్రియలు చేసే పద్ధతినే ఆమెకు చేయాలని నిర్ణయించారు. దీనికోసం అన్ని నిబంధనలను పాటిస్తూ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు అధికారులు. పోలీసుల సహాయంతో అంత్యక్రియల కోసం మృతదేహాన్ని స్థానిక శ్మశానవాటికకు తీసుకెళ్లగా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న స్థానికులు దీన్ని అడ్డుకున్నారు. అంతేకాకుండా వైద్యులు, పోలీసులపైనే తిరగబడి రాళ్లతో దాడి చేశారు. అంత్యక్రియల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ దాడి కొనసాగించారు. అంబులెన్సుపై కూడా దాడిచేసి ధ్వంసం చేశారు. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జీ చేసి గ్రామస్థులను చెదరగొట్టామని స్థానికి డీసీపీ రామ్‌కుమార్‌ వెల్లడించారు. ఈ సమయంలో లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా పోలీసులు, వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడినవారిపై కేసులు నమోదుచేశామన్నారు.

ఇదిలాఉంటే, హరియాణాలో ఇప్పటివరకు 289పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ముగ్గురు మరణించారు. ఇక ఈ ఘటన జరిగిన అంబాలాలో 12పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అయితే ఇలాంటి ఘటనలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే పలు రాష్ట్రాలు హెచ్చరించాయి. 

ఇవీ చదవండి..

కరోనాతో ఆటలొద్దు: అష్టాచమ్మా, క్యారమ్స్‌కు దూరం..! 

నిండు గర్భిణిని 200కి.మీ తిప్పారు..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని