వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వచ్చింది: ట్రంప్‌

కొవిడ్‌-19 కారక కరోనా వైరస్‌ మానవుల సృష్టి కాదని అమెరికా నిఘా సంస్థలు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు.......

Updated : 01 May 2020 12:34 IST

ఆధారాలను ఇప్పుడే చెప్పలేనన్న అగ్రరాజ్యాధిపతి

వాషింగ్టన్‌: కొవిడ్‌-19 కారక కరోనా వైరస్‌ మానవుల సృష్టి కాదని అమెరికా నిఘా సంస్థలు స్పష్టం చేసిన కొన్ని గంటల్లోనే ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన చేశారు. ఈ వైరస్‌ చైనాలోని వుహాన్‌లో ఉన్న వైరాలజీ ల్యాబ్‌ నుంచే బయటకు వచ్చిందని ఆరోపించారు. దీనికి సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ వివరాలను వెల్లడించానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు. దీనిపై ఇంకా లోతైన విచారణ జరుగుతోందని.. త్వరలోనే వాటి ఫలితాలు బయటకు వస్తాయని తెలిపారు. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వైరస్‌ బయటకు వచ్చిందని అంత బలంగా ఎలా చెప్పగలరని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ..‘‘నేను ఆ విషయాలు బటయకు చెప్పలేను. అలా చెప్పడానికి నాకు అనుమతి కూడా లేదు’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.    

అయితే, ఈ విషయంలో తాను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను బాధ్యుణ్ని చేయలేనన్నారు. కానీ, ఆదిలోనే దాన్ని నిలువరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ‘‘చైనా కట్టడి చేయలేకపోయిందా.. లేక కావాలనే నిర్లక్ష్యం వహించిందా అన్నది పక్కనబెడితే.. దీని ప్రభావం మాత్రం ప్రపంచంపై భారీ స్థాయిలో ఉంది’’ అని వ్యాఖ్యానించారు. బహుశా కీలక సమయంలో స్పందించకపోయి ఉండడం వల్లే చేజారిపోయి ఉంటుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. దీనికి ఆయన ఇటలీ పరిస్థితిని ఉటంకించారు. అయితే, అసలు చైనాలో ఏం జరిగిందన్నది మాత్రం తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని.. దానిపైనే విచారణ జరుగుతోందన్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తాయని తెలిపారు.    

అంతకు ముందు కరోనా వైరస్‌ మానవులు సృష్టించింది కాదని అమెరికా నిఘా సంస్థలు పేర్కొన్నాయి. అలాగే అది జన్యు మార్పిడి ద్వారా తయారైంది కూడా కాదని వివరించాయి. ఈ ఇన్‌ఫెక్షన్‌ జంతువుల నుంచి వచ్చిందా లేక చైనాలోని ప్రయోగశాల నుంచి ప్రమాదవశాత్తు వెలువడిందా అన్నది గుర్తించనున్నట్లు వెల్లడించాయి. 

ఇవీ చదవండి..

కరోనా వైరస్‌ మానవ సృష్టి కాదు

కొవిడ్‌పై రెమిడెసివిర్‌ పనిచేస్తోంది: గిలీద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని