
కరోనా యోధులకు సలాం: మే3న సైన్యం విన్యాసాలు
సైనిక, నౌకా, వాయుసేనలు పాల్గొంటాయి: సీడీఎస్ బిపిన్ రావత్
ముంబయి: మనందరినీ సురక్షితంగా ఉంచేందుకు శక్తివంచన లేకుండా పోరాడుతున్న ‘కరోనా యోధుల’కు కృతజ్ఞతలు తెలియజేస్తామని మహాదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశమంతా ఏకతాటిపై నిలిచిందని, పట్టుదలతో పోరాడుతోందని ప్రశంసించారు.
కరోనా యోధులైన వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, అధికారులకు సంఘీభావంగా మే 3న త్రివిధ దళాలు విన్యాసాలు ప్రదర్శిస్తాయని బిపిన్ రావత్ తెలిపారు. శ్రీనగర్ నుంచి తిరువనంతపురం, దిబ్రూగఢ్ నుంచి కచ్ వరకు భారత వైమానిక దళం విన్యాసాలు చేస్తుందన్నారు. ఇందులో సాధారణ, పోరాట విమానాలు పాల్గొంటాయని తెలిపారు.
నావికా దళం సైతం కరోనా యోధులకు సంఘీభావం ప్రకటిస్తాయని రావత్ వెల్లడించారు. సముద్ర తీరాల్లో నౌకలను ఉంచుతాయన్నారు. వాటి పైనుంచి బయల్దేరిన హెలికాఫ్టర్లు కొవిడ్-19 రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులపై పువ్వులు వెదజల్లుతాయని తెలిపారు. అంతేకాకుండా నౌకలపై దీపాలు వెలిగిస్తారని పేర్కొన్నారు.
కరోనా యోధుల వెనక సైనికులు సంఘీభావంగా నిలబడతారని బిపిన్ రావత్ తెలిపారు. ప్రతి జిల్లాలోని కొవిడ్-19 ఆస్పత్రి వద్ద సైనికులు మౌంటెయిన్ బ్యాండ్స్ ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. అవిశ్రాంతంగా సేవలందిస్తున్న పోలీసులకు అండగా పోలీసు స్మారక స్థూపాల వద్ద నివాళి అర్పిస్తామన్నారు. పోలీసులు అద్భుతంగా విధులు నిర్వర్తిస్తున్నారని ఆయన కొనియాడారు. రెడ్ జోన్లో రిస్క్ తీసుకొని పనిచేస్తున్నారని అక్కడి సైన్యాన్ని దించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సైనిక సేవలపై కొవిడ్-19 ప్రభావం లేదన్నారు.
సైన్యంలో కరోనా వైరస్ కట్టడికి ఇబ్బందులేమీ లేవని సైన్యాధిపతి జనరల్ మనోజ్ ఎం నరవనె స్పష్టం చేశారు. కొవిడ్-19 బారిన పడ్డ తొలి జవాన్ కోలుకుని తిరిగి విధుల్లో చేరాడని తెలిపారు. మొత్తం 14 మందికి వైరస్ సోకగా ఐదుగురు కోలుకొని విధుల్లో చేరారన్నారు. వైమానికదళంలో ఇప్పటి వరకు ఒక్క కేసూ నమోదవ్వలేదని వైమానిక దళాధిపతి ఆర్కేఎస్ భదౌరియా అన్నారు.
Advertisement