ఇంట్లో దూరం దూరంగానే..

భారతీయులు కరోనా వైరస్‌ మహమ్మారిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారని, చాలామంది సామాజిక దూరం నియమాలను కచ్చితంగా అమలు చేస్తున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

Published : 06 May 2020 22:14 IST

దిల్లీ: భారతీయులు కరోనా వైరస్‌ మహమ్మారిని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారని, చాలామంది వ్యక్తిగత దూరం నియమాలను కచ్చితంగా అమలు చేస్తున్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది. గుంపులుగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లడానికి ఇష్టపడటం లేదని పేర్కొంది. గ్లోబల్ పబ్లిక్‌ ఒపీనియన్ కంపెనీ యూగవ్‌, ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్‌ ఇన్నోవేషన్‌(ఐజీహెచ్‌ఐ) సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి. పట్టణప్రాంతాల్లోని సుమారు 10 ప్రాంతాల్లో ఏప్రిల్ 20 నుంచి 26 మధ్యలో ఈ వివరాలను సేకరించాయి. 

ఏ మందూలేని కరోనా వైరస్‌ కట్టడికి ప్రధాన ఆయుధం వ్యక్తిగత దూరమేనని వైద్య నిపుణులు చెప్తూనే ఉన్నారు. దాంతో వైరస్‌ సోకకుండా రోగ లక్షణాలు కనిపించిన వారికి 87 శాతం మంది దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారని ఆ సర్వే వెల్లడించింది. లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉండటంతో 74 శాతం మంది సాధ్యమైనంత తక్కువసార్లు దుకాణాలకు వెళ్తున్నామని చెప్పినట్లు పేర్కొంది. అలాగే 56 శాతం మంది ఇంట్లో కూడా  దూరాన్ని పాటిస్తున్నట్లు చెప్పారని, వేరుగా తింటున్నారని, పడుకొనే సమయంలో విడివిడి గదులు వాడుతున్నారని ఆ సర్వే పేర్కొంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి మాత్రం పెరుగుతూనే ఉంది. బాధితుల సంఖ్య 36లక్షలు దాటిపోయింది. అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌లలో ఈ వైరస్‌ తీవ్ర రూపం దాల్చింది. ఇదిలా ఉండగా మనదేశంలో కరోనా బాధితుల సంఖ్య 50 వేలకు చేరువలో ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని