అలాగైతే అమెరికా శత్రువు వైరస్‌.. చైనా కాదు!

వుహాన్‌లోని ప్రయోగశాల సినో-ఫ్రెంచ్‌ సహకార ప్రాజెక్టని చైనా తెలిపింది. మొదటి బ్యాచ్‌ సిబ్బంది మొత్తం ఫ్రాన్స్‌లోనే శిక్షణ పొందివచ్చారని వెల్లడించింది. కొవిడ్‌-19 ఆవిర్భావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విచారణకు అంగీకరిస్తున్నారో లేదో సూటిగా చెప్పలేదు. వైరాలజీ ప్రయోగశాలపై అమెరికా మంత్రి మైక్‌.....

Published : 08 May 2020 02:14 IST

వుహాన్‌ ప్రయోగశాల సినో-ఫ్రెంచ్‌ సహకార ప్రాజెక్టు

ప్రపంచ ఆరోగ్య సంస్థ విచారణపై నర్మగర్భంగా వ్యాఖ్యలు

బీజింగ్‌: వుహాన్‌లోని ప్రయోగశాల చైనా-ఫ్రాన్స్‌‌ సహకార ప్రాజెక్టని చైనా తెలిపింది. మొదటి బ్యాచ్‌ సిబ్బంది మొత్తం ఫ్రాన్స్‌లోనే శిక్షణ పొందివచ్చారని వెల్లడించింది. కొవిడ్‌-19 ఆవిర్భావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విచారణకు అంగీకరిస్తున్నారో లేదో సూటిగా చెప్పలేదు. వైరాలజీ ప్రయోగశాలపై అమెరికా మంత్రి మైక్‌ పాంపియో అసత్య ప్రచారాలు చేస్తున్నారని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి హువా చునియింగ్‌ విమర్శించారు.

‘పీ4 వుహాన్‌ వైరాలజీ ప్రయోగశాల సినో-ఫ్రెంచ్‌ సహకార ప్రాజెక్టని పాంపియోకు ఇంకా తెలియదనుకుంటా. నిర్మాణం, నిర్వహణలో ఇది అంతర్జాతీయ ప్రమాణాలను పాటించింది. మొదటి బ్యాచ్‌ సిబ్బంది ఫ్రెంచ్‌ ప్రయోగశాలల్లోనే శిక్షణ పొందారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్థలు పీ4 ల్యాబ్‌ పరికరాలను ఏటా పరీక్షిస్తారు’ అని చునియింగ్‌ అన్నారు.

పాంపియో తన వాదన నిజమేనని నిరూపించేందుకు బలమైన సాక్ష్యాలు చూపించాలని చునియింగ్‌ డిమాండ్‌ చేశారు. ‘ఆయనతో ఆయనే విభేదిస్తారు. అసత్యాలను కప్పిపుచ్చుకొనేందుకు మరిన్ని అబద్ధాలు చెబుతున్నారు. ఇది బహిరంగ రహస్యమే’ అని  విమర్శించారు.

రెండో ప్రపంచ యుద్ధంలో పెర్ల్‌హార్బర్‌, 2001, సెప్టెంబర్‌ 1 దాడుల కన్నా కరోనా వైరస్‌ దాడే తీవ్రమైందన్న ట్రంప్‌ వ్యాఖ్యలపై చునియింగ్‌ స్పందించారు. ‘ఒకవేళ దీనిని పెర్ల్‌హార్బర్‌ లేదా 9/11 దాడులతో పోలిస్తే, అప్పుడు అమెరికా ఎదుర్కొంటున్న శత్రువు కరోనా వైరస్‌ అవుతుంది. మరి శత్రువుతో అమెరికా పోరాడేందుకు చైనా సహకారం తీసుకోవాలి. ఎందుకంటే మేము ఈ యుద్ధంలో గెలిచాం. కానీ చాలామంది అమెరికన్‌ అధికారులు మాపై నిందలు వేస్తున్నారు’ అని ఆమె వెల్లడించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ విచారణకు ఐరాసలో చైనా రాయబారి చెన్‌ షు అంగీకరించారనట్టు వచ్చిన వార్తలపై ప్రశ్నించగా.. ‘మేం ప్రపంచ ఆరోగ్య సంస్థను వ్యతిరేకిస్తున్నట్టు ఎప్పుడూ చెప్పలేదు. మేం డబ్ల్యూహెచ్‌వో చేస్తున్న దానికి మద్దతు ఇస్తున్నాం. వైరస్‌ ఆవిర్భావం సహా అనేక అంశాలపై పారదర్శకంగా, నిజాయతీగా సహకరిస్తున్నాం. సరైన సమయంలో (విచారణపై) నిర్ణయం వస్తుంది. కానీ మేం తప్పు చేశామనే రీతిలో దర్యాప్తులు చేపడతామంటూ అమెరికా రాజకీయాలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని చునియింగ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని