మీరు డాక్టరైతే అమెరికా గ్రీన్‌ కార్డు ఇచ్చేస్తుంది!

అగ్ర రాజ్యం అమెరికాలో స్థిరపడాలని ఎవరికి మాత్రం ఉండదు. అయితే, ప్రస్తుతం ఆ దేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా

Updated : 09 May 2020 19:13 IST

వాషింగ్టన్‌: అగ్ర రాజ్యం అమెరికాలో స్థిరపడాలని ఎవరికి మాత్రం ఉండదు. అయితే, ప్రస్తుతం ఆ దేశం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం ఆ దేశంలో తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో అక్కడి చట్టసభ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరికీ కేటాయించని దాదాపు 40వేల గ్రీన్‌ కార్డులను విదేశీ డాక్టర్లు, నర్సులకు తక్షణమే జారీ చేయాలంటూ అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభల్లోనూ బిల్లును ప్రవేశపెట్టారు. గతంలో కాంగ్రెస్‌ ఆమోదించినప్పటికీ జారీ కాని గ్రీన్‌ కార్డులను ఇప్పుడు మంజూరు చేయాలని బిల్లులో పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో వైద్యుల, నర్సుల కొరత విపరీతంగా ఉంది.

ఇప్పటివరకూ అమెరికాలో 12లక్షల మందికిపైగా కరోనా బారిన పడగా, మృతుల సంఖ్య 77 వేలు దాటింది. ఈ నేపథ్యంలో చట్టసభ ప్రతినిధులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ది హెల్త్‌కేర్‌ వర్క్‌ ఫోర్స్‌ రీసైలెన్స్‌ యాక్ట్‌ ప్రకారం ఏళ్లుగా వినియోగించకుండా ఉన్న గ్రీన్‌కార్డులకు అనుమతి ఇచ్చే అధికారం అక్కడి కాంగ్రెస్‌కు ఉంది. కార్డులను మంజూరు చేయడం ద్వారా అక్కడి పౌరులకు వైద్య సహాయం అందించడంతో పాటు, అమెరికాలో శాశ్వత నివాసాన్ని పొందవచ్చు.

అమెరికా కాంగ్రెస్‌  చేసిన ప్రతిపాదనల ప్రకారం చట్టం ఆమోదం పొందితే 25వేలమంది నర్సులు, 15వేల మంది వైద్యులు గ్రీన్‌కార్డులను పొందే అవకాశం ఉంది. వీరంతా కొవిడ్‌-19పై పోరులో భాగంగా వైద్య సేవలు అందించాలి. హెచ్‌-1బీ, జే2 వీసాలపై ఉన్న భారతీయ వైద్యులు, నర్సులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.

అమెరికాలోని కంపెనీల్లో పనిచేసేందుకు హెచ్‌-1బీ వీసాలను విదేశీయులకు మంజూరు చేస్తారు. ఏటా 10వేల మంది ఉద్యోగులను వివిధ కంపెనీలు తీసుకుంటాయి. ముఖ్యంగా భారత్‌, చైనాల నుంచి ఈ వీసా దరఖాస్తులు ఎక్కువగా వస్తాయి. ‘‘ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతి అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. వైరస్‌ దానంతట అది అంతర్థానమైపోదు. అయితే, అమెరికాను వైద్య నిపుణుల కొరత వేధిస్తోంది’ అని ఈ చట్టం రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ప్రతినిధుల్లో ఒకరైనా అబీ ఫింకినార్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని