
భోజనం.. నీళ్లు లేవు: 800 కి.మీ. ప్రయాణం
రాయ్‌పూర్: మహమ్మారి కరోనా వైరస్ వలస కూలీల పాలిట పెను శాపంగా మారింది. స్వస్థలాలకు చేరుకునేందుకు వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ఇప్పటివరకూ కాలి నడకన, సైకిళ్లపైనా, దొంగచాటుగా వెళ్లారు. ఇటీవల ప్రభుత్వం ఆంక్షలు సడలించి ప్రత్యేక రైళ్లు వేయడంతో కాస్త ఉపశమనం లభించింది. మరోవైపు లారీల ద్వారా వలసకూలీలను తరలిస్తున్నారు. అలా ఛత్తీస్‌గఢ్‌కు చేరిన కూలీల పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు.
తెలంగాణ నుంచి ఛత్తీస్‌గఢ్‌కు ఒక పెద్ద ఇనుప ట్రక్‌లో పలువురు వలస కూలీలు బయలుదేరి వెళ్లారు. దారి మధ్యలో కనీసం వాళ్లు తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి. అలా 800 కి.మీ. ప్రయాణించారు. మండుటెండలో వారు పడిన అవస్థలు చెప్పలేనవి. పైన ఎండ మండిపోతుంటే ఆ వేడికి ట్రక్ పెనంలా మాడిపోతుంటే ఆ బాధనంతా పంటి బిగువన భరించారు. తమ బిడ్డలకు ఎండ తగలకుండా చీర కొంగు కప్పి తీసుకెళ్తున్న దృశ్యం అవి చూసిన వారి హృదయాలను కలచి వేసింది.
‘రెండు గంటలకు పైగా మండుటెండలోనే ప్రయాణిస్తున్నాం. కనీసం మాకు తాగడానికి, తినడానికి కూడా ఏమీలేవు’ అని అందులో ప్రయాణిస్తున్న ఓ వలస కూలీ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాలుగు రోజుల కిందట మేము హైదరాబాద్‌లో బయలు దేరాం. అధికారులెవరూ మాకు ఏదీ ఇవ్వలేదు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా సాయం చేయలేదు. కనీసం మా పిల్లలకైనా తినడానికి ఏమైనా ఇవ్వండి’ అని ఓ మహిళ వాపోయింది.