పుట్టిన చోటే వైరస్‌ను ఆపేస్తే బాగుండేది: ట్రంప్‌

అమెరికాలో కొవిడ్‌-19 పరీక్షల సామర్థ్యాన్ని భారీగా పెంచామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఈ వారంలో పరీక్షల సంఖ్య కోటి దాటుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ఎఫ్‌డీఏ అధీకృత 92 ప్రభుత్వ ప్రయోగశాలల్లో 90 లక్షలకు పైగా పరీక్షలు చేశారు. మూడు వారాల క్రితం రోజుకు 1,50,000గా ఉన్న టెస్టులను 300,000కు పెంచారు....

Published : 12 May 2020 14:30 IST

ఈ వారంలో కోటి దాటనున్న పరీక్షలు

వాషింగ్టన్‌: అమెరికాలో కొవిడ్‌-19 పరీక్షల సామర్థ్యాన్ని భారీగా పెంచామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఈ వారంలో పరీక్షల సంఖ్య కోటి దాటుతుందని వెల్లడించారు. ప్రస్తుతం ఎఫ్‌డీఏ అధీకృత 92 ప్రభుత్వ ప్రయోగశాలల్లో 90 లక్షలకు పైగా పరీక్షలు చేశారు. మూడు వారాల క్రితం రోజుకు 1,50,000గా ఉన్న టెస్టులను 300,000కు పెంచారు.

అగ్రరాజ్యంలో 13 లక్షల మందికి కరోనా వైరస్‌ సోకగా 80వేల మంది మరణించారు. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా 40 లక్షల మందికి సోకగా 2,85,000 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ‘దక్షిణ కొరియా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జపాన్‌, స్వీడన్‌, ఫిన్లాండ్‌ మరే ఇతర దేశంతో పోల్చుకున్నా మనమే ఎక్కువ పరీక్షలు చేస్తున్నాం. ఏ రెండు దేశాలను కలిపి తీసుకున్నా మనమే ముందుంటాం’ అని ట్రంప్‌ అన్నారు.

‘మన జాతి ప్రయోజనాల కోసం ఈ వైరస్‌పై పోరాడేందుకు ప్రభుత్వం అన్ని వనరులను ఉపయోగించుకుంటోంది. ప్రభుత్వ, ప్రైవేటు, సైన్యం, ఆర్థిక, శాస్త్ర, పారిశ్రామిక విభాగాలను ఉపయోగించుకుంటున్నాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత ఎక్కువగా ఉత్పత్తి పెంచాం. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి ఉపద్రవం లేదు. మరోసారి ఇలా సంభవించకుండా చూసుకోవాలి. ఈ ప్రపంచ మహమ్మారి మనకు బాధలు, కష్టాలను తీసుకొచ్చింది. ఆవిర్భవించిన చోటే దీనిని ఆపితే బాగుండేది. ప్రపంచవ్యాప్తంగా కనీసం 184 దేశాలు దీంతో బాధపడుతున్నాయి’ అని ట్రంప్‌ తెలిపారు.

‘ప్రస్తుత త్రైమాసికంలో మన ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. తర్వాతి త్రైమాసికంలో డిమాండ్‌ పుంజుకుంటుందని ఆశిస్తున్నా. కరోనా వైరస్‌ కారణంగా ప్రజలెంతో నేర్చుకున్నారు. నిరంతరం చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. ఫేస్‌మాస్క్‌లు ధరిస్తున్నారు. ఏదేమైనా అమెరికా చాలా నేర్చుకుంది. కేసులు సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. గణాంకాలను పరిశీలిస్తే మీకే తెలుస్తుంది’ అని ట్రంప్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు