భారత్‌లో అందుకే కేసులు పెరుగుతున్నాయా?

కరోనా వైరస్‌ను అరికట్టడానికి దేశంలో లాక్‌డౌన్‌ విధించి సుమారు రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆంక్షలను సడలించింది...

Updated : 16 May 2020 20:38 IST

ట్రక్కులు, టెంపోల్లో ప్రయాణిస్తున్న వలసదార్లు..

ముంబయి: కరోనా వైరస్‌ను అరికట్టడానికి దేశంలో లాక్‌డౌన్‌ విధించి సుమారు రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆంక్షలను సడలించింది. వారి తరలింపునకు శ్రామిక్‌ రైళ్లు, ఆర్టీసీ బస్సులు ఏర్పాట్లు చేసినా చాలా మంది వలసదార్లు లారీలు, టెంపో వాహనాల్లో వెళ్లేందుకే మోగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో భౌతిక దూరం పాటించకుండా ప్రయాణిస్తూ కరోనా వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నారు! దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో అనేక రాష్ట్రాల నుంచీ వేల సంఖ్యలో వలసలు వచ్చి జీవిస్తుంటారు. లాక్‌డౌన్‌ కారణంగా వారందరికీ ఉపాధి లేకపోవడంతో చేతిలో డబ్బులు కరవయ్యాయి. ఇక చేసేది లేక స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతూ ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. 

ఒక్కొక్కరి నుంచి రూ.1500 నుంచి 4500 వసూలు చేస్తున్నారు..

బస్సుల్లో వెళ్తే కేవలం ఆయా రాష్ట్రాల సరిహద్దుల వరకే వెళ్లాల్సి వస్తుందని. రైళ్లలో వెళ్లాలంటే తమ గమ్యస్థానాలకు దూరంగా ఉండే స్టేషన్లలో దిగాల్సి వస్తుందని అనేక మంది వాపోతున్నారు. ఈ క్రమంలో అక్కడి నుంచి మళ్లీ తమ స్వగ్రామాలకు చేరుకోవాలంటే ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తుందని చెప్పారు. అందుకు బదులు లారీల్లో, టెంపో వాహనాల్లో వెళితే తమకు అనుకూలంగా, స్వగ్రామాల దగ్గర్లో దిగి వెళ్లొచ్చని అభిప్రాయపడ్డారు. ఇలా ప్రయాణించడం కష్టమైనా ఇదే ఉత్తమ మార్గమని చెబుతున్నారు. మరోవైపు దొరికిందే అవకాశంగా.. లారీ డ్రైవర్లు, టెంపో వాహనాల యజమానులు వలసకార్మికుల నుంచి నిలువు దోపిడీ చేస్తున్నారు. ముంబయి నుంచి మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌ లాంటి రాష్ట్రాలకు వెళ్లాలంటే ఒక్కో వ్యక్తి నుంచి సుమారు రూ.1500 నుంచి 4500 దాకా వసూలు చేస్తున్నారు. ఏదేమైనా తొందరగా స్వగ్రామాలకు వెళ్లాలని భావించి వారు కూడా అధికమొత్తంలో చెల్లించి ప్రయాణాలు సాగిస్తున్నారు. 

ఇప్పుడు రహదార్ల వెంట నడిచే వారు తగ్గారు..

కాగా, ఆంక్షల సడలింపులకు ముందు అనేక మంది వలసదార్లు తట్టాబుట్టా సర్దుకొని జాతీయ రహదార్లపై నడుచుకుంటూ వెళ్లడం సాగించేవారు. ఇప్పుడు రవాణా సౌకర్యాలు కాస్త మెరుగవ్వడంతో అలా నడిచి వెళ్లే వారి సంఖ్య బాగా తగ్గిందని రహదార్ల వెంట నివసించే స్థానికులు చెబుతున్నారు. దేశంలో మహారాష్ట్రలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో వలసదార్లు లారీల్లో, ఇతర వాహనాల్లో గుమిగూడి వెళ్తుండడంతో భౌతిక దూరం పాటించలేకపోతున్నారు. దీంతో కేసులు పెరిగే అవకాశం లేకపోలేదు. మరోవైపు కొందరు వలసదార్లు శ్రామిక్‌ రైళ్లలో వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకున్నా సరైన స్పందన రాలేదని వాపోయారు. అనుమతుల కోసం పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని ఉమేశ్‌ కుమార్‌ అనే ఓ కార్మికుడు వివరించారు. ఈ నేపథ్యంలోనే కష్టమైనా ఇలా వెళ్లేందుకే మొగ్గుచూపతున్నానని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, వలసదార్లు ఇంటికి చేరుకునే క్రమంలో చాలా మంది రోడ్డు ప్రమాదాలకు గురౌతున్నారు. ముఖ్యంగా లారీల్లో వెళ్లేవారు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుండడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని