వుహాన్‌ ల్యాబ్‌పై వెనక్కి తగ్గిన అమెరికా?

కరోనావైరస్‌ వ్యాప్తికి చైనానే కారణమని గతకొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షునితో సహా అక్కడి అధికారులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ వైరస్‌ కచ్చితంగా వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచే వచ్చిందని ఇప్పటివరకూ ఆరోపిస్తూ వస్తున్నారు.

Published : 19 May 2020 03:39 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తికి చైనానే కారణమని గతకొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడితో సహా అక్కడి అధికారులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ వైరస్‌ కచ్చితంగా వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచే వచ్చిందని ఇప్పటివరకూ ఆరోపిస్తూ వస్తున్నారు. అంతేకాదు దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని పలుమార్లు స్పష్టం చేశారు. అయితే, తాజాగా ఈ ఆరోపణలపై అమెరికా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. కరోనా వైరస్‌ వుహాన్ నుంచే వచ్చిందని తెలుసు కానీ, ఎక్కడ, ఎవరి నుంచి వచ్చిందనే విషయం తెలియదని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియా వెల్లడించారు. తాజాగా ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాంపియో ఈ విధంగా స్పందించారు. కరోనా వైరస్‌ మూలాలు కనుక్కునేందుకు అక్కడి వారికి సాయపడేందుకు ప్రత్యేక బృందాలను పంపిస్తామని పదేపదే కోరినప్పటికీ చైనా నిరాకరించిందని పాంపియో తెలిపారు.

అయితే ఈ వైరస్‌ వుహాన్‌ వైరాలజీ ల్యాబ్‌ నుంచే వచ్చిందనే విషయంపై స్పష్టత లేదని పాంపియో అంగీకరించారు. ఇప్పటివరకు ఉన్న ఆధారాలు కూడా తప్పు కావచ్చని పాంపియో అభిప్రాయపడ్డారు. అయితే వ్యాక్సిన్‌ అభివృద్ధిలో వైరస్‌ ఎక్కడ పుట్టిందనే విషయం ఎంతో కీలకమన్నారు. ఈ సమయంలో చైనా పారదర్శకత పాటించలేదన్నారు. అంతేకాకుండా ఈ మహమ్మారికి కారణమైన చైనాపై చర్యలు తప్పవని మరోసారి పునరుద్ఘాటించారు. అయితే ఇది ఎలా ఉంటుందనే విషయం మాత్రం అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. 

గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఇదే తరహా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ల్యాబ్‌నుంచి బయటకు వచ్చే అవకాశమే లేదని వాదించారు. అయితే దీనిపై అమెరికా ఇంటెలిజెన్స్‌ విభాగం మాత్రం రెండు వైపుల ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. ఇదిలా ఉంటే, అమెరికాలో ఇప్పటివరకు 15లక్షల మందికి ఈ వైరస్‌ సోకగా 90వేల మంది మరణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని