స్మార్ట్‌ మాస్క్‌తో కరోనాకి చెక్‌...

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నప్పటికీ, కొన్ని దేశాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో కరోనాతో కలిసి జీవించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనాను మరింత సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు....

Updated : 19 May 2020 10:48 IST

సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు 

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నప్పటికీ, కొన్ని దేశాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో కరోనాతో కలిసి జీవించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనాను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు పరిశోధకులు సరికొత్త ఉపకరణాలను రూపొందిస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఎమ్‌ఐటీ (మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ), హార్వర్డ్‌ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు సెన్సర్ల సహాయంతో కరోనాను గుర్తించే సాంకేతికతను అభివృద్ది చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు ఈ సెన్సర్లు ఉన్న మాస్కులు ధరించిన వెంటనే అవి ఒక రకమైన వెలుతురును ప్రసరింపజేస్తాయి. ఆ వెలుగు కంటికి కనిపించనప్పటికీ ధర్మల్‌ స్కానర్‌ సహాయంతో గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 

ఎలా పనిచేస్తాయి...

ఈ మాస్కుల్లో సెన్సర్లను పేపర్‌ లేదా ప్లాస్టిక్‌పై అతికించి దాన్ని జెనిటిక్‌ మెటిరియల్ సహాయంతో గుడ్డతో కలిపి మాస్కులా రూపొందిస్తున్నారు. ఇది గది ఉష్ణోగ్రత వద్ద కొన్ని నెలలపాటు అలాగే ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రత్యేక సాంకేతికతతో రూపొందిన ఈ మాస్కులు ధరించిన వ్యక్తి గాలి పీల్చినప్పుడు అందులోని తేమ, మాట్లాడినప్పుడు నోటి నుంచి వెలువడే లాలాజలం తుంపర్లను సెన్సర్లు గ్రహించి వాటిలో కరోనా లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే ఒక రకమైన కాంతిని (ఫ్లోరోసెంట్ లైట్) వెదజల్లుతాయి. ఆ కాంతిని ఫ్లోరీమీటర్స్ సహాయంతో వెంటనే గుర్తించవచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ ఫ్లోరీమీటర్స్‌ను విమానాశ్రయాల భద్రత ద్వారాల వద్ద, ఆస్పత్రుల్లో, జనసాంద్రత ఉండే ప్రదేశాల్లో అమర్చి కరోనా సోకిన వ్యక్తులను ముందుగానే గుర్తించవచ్చని పరిశోధన బృందంలో సభ్యుడైన జిమ్‌ కోలిన్స్‌ అనే శాస్త్రవేత్త తెలిపారు. సాధారణంగా కరోనా సోకిన వ్యక్తిని గుర్తించేందుకు నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం వాటిని లేబోరేటరికి పంపిన తర్వాత కానీ ఫలితాలు వెలువడవు. అయితే సెన్సర్‌ సాంకేతికత కలిగిన ఈ మాస్క్‌ ధరించిన మూడు గంటల్లో ఫలితాలు తెలుస్తాయని దీనిని అభివృద్ధి చేసిన పరిశోధకుల బృందం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని