Published : 19/05/2020 03:31 IST

డ్రాగన్‌ వైఖరితో సమాధానాల్లేని ప్రశ్నలెన్నో..!

చైనాపై మరోసారి అమెరికా ఆరోపణలు

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో చైనాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న అమెరికా తాజాగా మరో ఆరోపణ చేసింది. ఈ మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తెలిసీ చైనా తమ ప్రజల్ని ఇతర దేశాలకు ప్రయాణించేందుకు అనుమతిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఆరోపించారు. చైనాకు భవిష్యత్తులో ఎలాంటి జరిమానా విధించాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయిస్తారని ఆయన హెచ్చరించారు.  ప్రపంచ వ్యాప్తంగా 3లక్షల మందికి పైగా ప్రాణాల్ని బలిగొన్న కరోనా విషయంలో చైనా వైఖరిపై ట్రంప్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చైనాతో తమ సంబంధాలను పూర్తిగా తెగతెంపులు చేసుకుంటామంటూ ఇటీవల తీవ్రంగా హెచ్చరించారు కూడా. ఈ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడబోనని కూడా ప్రకటించిన నేపథ్యంలో పాంపియో ఓ ఇంటర్వ్యూలో చైనా వైఖరిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. 

మరోవైపు, కరోనా వైరస్‌ మూలాలపై విచారణకు చైనా అంగీకరించాలని, వుహాన్‌లోని ఓ ప్రయోగశాల నుంచి ఈ వైరస్‌ బయటకు వచ్చిందనే ఆరోపణలపైనా దర్యాప్తుకు సహకరించాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో పాంపియో మాట్లాడుతూ.. ‘‘చైనా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని గమనిస్తే.. కరోనా ముప్పును మరింతగా పెంచేలా చైనా వ్యవహరిస్తోంది. ఆ దేశ ప్రజలు ఇప్పటికే ప్రపంచమంతా తిరుగుతున్నారు ఎందుకని? ఈ మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ తమ దేశంలోని ప్రధాన నగరాన్ని లాక్‌డౌన్‌ చేసినా ఇతర దేశాలకు మాత్రం తమ ప్రజల్ని పంపిస్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుత వైఖరికి భిన్నంగా చైనా వ్యవహరించి ఉంటే ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలకు మరింత సమయం ఉండేది. డిసెంబర్‌లోనో అంతకన్నా ముందో ఈ సమస్య అక్కడ ఉందని తెలిసినా వారు ప్రపంచానికి సమాచారం ఇవ్వకపోవడాన్ని నేను గతంలోనూ ప్రశ్నించా’’ అని పాంపియో అన్నారు.

చైనా నాయకత్వం మోసపూరిత వైఖరితో సమాచారం ఇవ్వడంలేదంటూ గతంలో అమెరికాకు చెందిన ఓ దౌత్యవేత్త వ్యాఖ్యలపైనా పాంపియో స్పందించారు. ‘‘వైరస్‌ మూలాలను గుర్తించేందుకు అక్కడి వారికి సహాయపడేందుకు బృందాలను పంపుతామని పదేపదే అడుగుతున్నాం. అది వుహాన్‌లోనే పుట్టిందని మనకు తెలుసు. కానీ ఎక్కడి నుంచో, ఎవరి నుంచో అనేది ఎవరికీ తెలియదు. ఇవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందరికీ ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది’’ అన్నారు. 

‘‘చైనా ప్రతిసారి సమాచార సరఫరాను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థనూ ప్రభావితం చేసేలా వ్యవహరిస్తోంది. దీని గురించి ఎవరైనా వైద్యులు బహిరంగంగా మాట్లాడితే వారికి శిక్షలు విధిస్తోంది. పారదర్శకంగా వ్యవహరిస్తూ ఇతర దేశాలకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరిస్తోంది. దీని ఫలితంగా సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో మిగిలిపోయాయి’’ అని వ్యాఖ్యానించారు. కొవిడ్‌ మహమ్మారి బారిన పడి ఇప్పటిదాకా అమెరికాలో 88వేల మందికి పైగా మృత్యువాతపడిన విషయం తెలిసిందే. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని