వైరస్‌ నివారణ.. ఆరడుగుల దూరం సరిపోదా?

కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు మనుషుల మధ్య వ్యక్తిదూరం ఎంతో ముఖ్యం. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం కనీసం 6 అడుగుల దూరం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

Published : 20 May 2020 15:18 IST

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు వ్యక్తుల మధ్య భౌతికదూరం ఎంతో ముఖ్యం. ప్రస్తుతం అంతర్జాతీయ మార్గదర్శకాల ప్రకారం కనీసం 6అడుగుల దూరం ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేందుకు ఆరడుగుల దూరం సరిపోదని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణంగా గంటకు 4-15కి.మీ వేగంతో గాలి వీస్తున్న సమయంలో దగ్గు వల్ల వచ్చే తుంపరులు కనీసం 18అడుగుల దూరం ప్రయాణిస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. దీంతో కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత దూరం మరింత ఎక్కువే ఉండాల్సిన అవసరాన్ని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

వ్యక్తులు దగ్గినప్పుడు వైరస్‌ కణాలు గాలిలో ఏవిధంగా ప్రయాణిస్తాయి అనే అంశంలో సైప్రస్‌ దేశానికి చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ నికోసియా అధ్యాపకులు పరిశోధనలు చేపట్టారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో గాలిలో వైరస్‌ వ్యాప్తి గురించి పరిశోధనలు చేశారు. దీనికి సంబంధించిన తాజా నివేదిక ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌లో ప్రచురితమైంది.

దాదాపు స్వల్ప వేగంతో(గంటకు 4కి.మీ) వీచే గాలుల వల్లకూడా నోటి తుంపరులు 5సెకండ్లలోనే దాదాపు 18 అడుగుల దూరం ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి తుంపరులు భిన్న శారీరక ఎత్తు కలిగిన చిన్నారులతోపాటు పెద్దవారిపై కూడా ప్రభావం చూపిస్తాయని పరిశోధనలో పాల్గొన్న డిమిట్రిస్‌ డ్రికాకిస్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా లాలాజల తుంపరులు పయణించే మార్గంలో లేదా ఆ సమీపంలో ఉండే తక్కువ శారీరక ఎత్తు ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం ఉంటుందని స్పష్టం చేశారు.

వ్యక్తి దగ్గినప్పుడు వచ్చే లాలాజల తుంపరులు గాలిలో కొంతదూరం ప్రయాణిస్తాయి. అయితే దీనిపై అక్కడి గాలి వేగం, వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రత, గాలిలో తేమ వంటి అంశాలు ప్రభావితం చేస్తాయనే విషయం తెలిసిందే. ఈ సమయంలో వైరస్‌ కణాల వ్యాప్తి దూరాన్ని తెలుసుకునేందుకు దగ్గతున్న వ్యక్తి సమీపంలో కంప్యూటర్‌ తరహా పరికరాన్ని అమర్చి పరిశోధన చేశారు. ఆ సమయంలో వ్యక్తి దగ్గడం వల్ల వచ్చే లాలాజలం కణాలపై తేమ ప్రభావం, అవి ప్రయాణించే మార్గంలో అవి ఆవిరయ్యే తీరు, అవి ప్రయాణించే దూరం వంటి అంశాల సమాచారాన్ని సేకరించారు. ఇలా సేకరించిన 1008 అనుకరణలను విశ్లేషించి నివేదిక రూపొందించామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

అయితే గాలిలో నోటి తుంపరుల ప్రయాణంపై ఉపరితల ఉష్ణోగ్రత ప్రభావం ఎంతమేరకు ఉంటుందనే దానిపై మరింత పరిశోధన అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఏసీ గదుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. వ్యక్తిగత దూరంపై ప్రస్తుతమున్న మార్గదర్శకాల నేపథ్యంలో ఇలాంటి ప్రయోగాలు ఎంతో ముఖ్యమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా గాలి ద్వారా సోకే వ్యాధుల గురించి మరింత అవగాహన కోసం ఇవి ఎంతో ఉపయోగపడుతాయని అంటున్నారు.

ఇవీ చదవండి..

రెండోసారి వైరస్‌..ప్రమాదమే లేదా?

భారత్‌లో ఒకేరోజు 5611 కరోనా కేసులు..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని