రెండు వారాల్లో 65లక్షల టెస్టులు..ఫలితమెంత?

కరోనా వైరస్‌కు పుట్టినిళ్లైన వుహాన్‌లో ఈ వైరస్‌ రెండోదఫా విజృంభిస్తుందనే ఆందోళన నెలకొంది. లక్షణాలు కనిపించకుండానే పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు బయటపడుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో దాదాపు కోటి మంది జనాభా కలిగిన వుహాన్‌ నగరంలో ప్రతి వ్యక్తికి కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయాలని ఈ నెల 14న నిర్ణయించింది.

Published : 27 May 2020 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌కు పుట్టినిల్లు వుహాన్‌లో ఈ వైరస్‌ రెండోదఫా విజృంభిస్తుందనే ఆందోళన నెలకొంది. లక్షణాలు కనిపించకుండానే పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు బయటపడుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో దాదాపు కోటి మంది జనాభా కలిగిన వుహాన్‌ నగరంలో ప్రతి వ్యక్తికి కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయాలని ఈ నెల 14న నిర్ణయించింది. దీనికోసం రెండు వారాల టార్గెట్‌ విధించుకొని ఈనెల 15న ప్రారంభించగా.. ప్రస్తుతం అది 90శాతం పూర్తయ్యింది. అయితే, వైరస్‌ తీవ్రత స్వల్పంగానే ఉన్న సమయంలో భారీ స్థాయిలో చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల ఫలితమేంటనే చర్చ కూడా నడుస్తోంది.

కోటి మందికి కొవిడ్‌ పరీక్షలు..
ప్రభుత్వ నిర్ణయంతో రంగంలోకి దిగిన వుహాన్‌ అధికారులు నగరంలోని ప్రతి వ్యక్తి కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని ఆదేశించారు. దీనిలో భాగంగా వ్యక్తుల నుంచి స్వా
బ్‌ శాంపిళ్లను సేకరించారు. ఈ ఆదివారం నాటికి నగరంలోని దాదాపు 90లక్షల మంది శాంపిళ్లను తీసుకున్నారు. వీరిలో ఇప్పటివరకు 65లక్షల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పూర్తి చేశారు. మరో రెండు మూడు రోజుల్లోనే దాదాపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తికానుందని అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ భారీ ప్రక్రియను చేపట్టడానికి వుహాన్‌ అధికారులు చాలా కృషి చేశారు. చాలా చోట్ల వీధుల్లోనే బహిరంగ ప్రదేశాల్లో వీటిని చేపట్టారు. స్వాబ్‌ టెస్టు కిట్లను వెంటబెట్టుకుని భవన నిర్మాణ ప్రాంతాలకు, మార్కెట్లకు వెళ్లి పరీక్షించారు. అంతేకాకుండా అంగవైకల్యంతో ఉన్నవారిని గుర్తించి వారి ఇంటికే వెళ్లి పరీక్షలు నిర్వహించారు. ప్రజల సంక్షేమం కోసమే వుహాన్ వాసులు ఈ పరీక్షలకు ముందుకు రావాలని మైకుల ద్వారా వీధుల్లో, నివాస ప్రాంతాల్లో ప్రచారం చేశారు. దీనికోసం విస్తృతంగా వైద్య, ఇతర సిబ్బందిని వినియోగించి భారీ ఖర్చుతో చేపట్టిన ఈ కార్యక్రమం దాదాపు విజయవంతమైనట్లు అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. వీటి ఫలితాలను కూడా రెండు నుంచి నాలుగు రోజుల్లోనే తెలుపుతున్నట్లు వెల్లడించారు.

భారీగా పరీక్షా కిట్ల వినియోగం..
దాదాపు కోటి మందిని పరీక్షించాలని చేపట్టిన ఈ కార్యక్రమానికి భారీగా టెస్టింగ్‌ కిట్లను వినియోగించింది అక్కడి ప్రభుత్వం. వైరస్‌ బయటపడ్డ తొలినాళ్లతో పోలిస్తే అత్యధిక కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా కేవలం ప్రతిరోజు 46వేల పరీక్షలు చేసే సామర్థ్యం ఉండగా..ప్రస్తుతం అది ప్రతిరోజు దాదాపు 10లక్షల టెస్టులు చేసే స్థాయికి వెళ్లిపోయింది.

పరీక్షలకు నిరాకరిస్తే చర్యలు..
ఇంత భారీ స్థాయిలో చేపట్టిన కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ప్రతిఇంటికి వెళ్లి ప్రజలను వైద్యపరీక్ష కేంద్రాలకు తరలిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా కొవిడ్‌ పరీక్షకు నిరాకరిస్తే వారిపై చర్యలకు కూడా పూనుకున్నారు. వారికి ప్రభుత్వం ఇచ్చే ఆరోగ్య కోడ్‌ను తగ్గించడంతోపాటు, వారి ఉద్యోగం, ప్రయాణ పరిమితులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సూపర్ మార్కెట్లు, బ్యాంకుల్లోకి కూడా అనుమతించమని పేర్కొన్నారు. అంతేకాకుండా వారికి ఉండే గ్రీన్‌ కోడ్‌, యెల్లో కోడ్‌గా మారుతుందని హెచ్చరించారు.

నిపుణుల నుంచి వ్యతిరేకత..
వైరస్‌ ధాటికి అతలాకుతలమైన వుహాన్‌లో సాధారణ పరిస్థితులు ఏర్పడి ప్రజలు స్వేచ్ఛగా వారి పనులు చేసుకునేలా వారిలో విశ్వాసం కలిగించేందుకే ఈ భారీ కార్యక్రమాన్ని చేపట్టిన్నట్లు అక్కడి ప్రభుత్వం పేర్కొంది. అందుకే ఈ కొవిడ్‌ పరీక్షలను కూడా ఉచితంగానే చేస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రభుత్వ చర్యను మాత్రం కొందరు నిపుణులు వ్యతిరేకిస్తున్నారు. భారీ శ్రమ, ఖర్చుతో కూడుకున్న ఈ పనిని వైరస్‌ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలో చేయడం అనవసరమని అంటున్నారు. ప్రస్తుతం కేవలం 200వరకు మాత్రమే పాజిటివ్‌ కేసులు బయటపడ్డట్లు వెల్లడించారు. ఇంత తక్కువ సమయంలో లక్షల సంఖ్యలో చేసే పరీక్షలతో కచ్చితమైన ఫలితాలు రాబట్టడం చాలా కష్టమని హాంగ్‌కాంగ్‌ యూనివర్సిటీకి చెందిన వైరాలజిస్ట్‌ జిన్‌ డోంగ్యాన్‌ అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో చాలా ఫలితాలు తప్పుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండాయని జిన్‌ వెల్లడించారు. దాదాపు కోటి జనాభా ఉన్న వుహాన్‌ ప్రస్తుతం వైరస్‌ తీవ్రత తక్కువగానే ఉన్నందున లక్ష శాంపిల్స్‌ సేకరిస్తే సరిపోయేదని అన్నారు. చైనా సీడీసీ కి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డా.వూ జున్యూ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. నగరంలోని ప్రతిఒక్కరికి కొవిడ్‌ పరీక్షలు చేయాల్సిన అవసరం లేదన్నారు. తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తొలుత పరీక్ష చేయించుకున్న వ్యక్తికి తరువాతైనా వైరస్‌ సోకే అవకాశం ఉంటుందని తేల్చిచెప్పారు.

ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్న తరుణంలో.. దీనివల్ల వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు నగరంలో వైరస్‌ తీవ్రతపై ఓ స్పష్టమైన అవగాహన వస్తుందని అక్కడి ప్రభుత్వం సమర్ధించుకుంటోంది.

ఇవీ చదవండి..
పుట్టి ముంచిన వుహాన్‌ విందు..!
వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే వచ్చింది: ట్రంప్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని