‘గూఢచారి’ పావురం విడుదల

పాకిస్థాన్‌ ‘గూఢచారి’ అనే అనుమానంతో భద్రతాదళాలు బంధించిన పావురం చివరికి విడులైంది.

Published : 30 May 2020 15:00 IST

దిల్లీ: పాకిస్థాన్‌ ‘గూఢచారి’ అనే అనుమానంతో భద్రతాదళాలు బంధించిన పావురం చివరికి విడులైంది. పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఆ పావురం తనదిగా చెప్పడంతో పాటు, దానికి సంబంధించి అనుమానాస్పదంగా ఏమీ లేకపోవడంతో బంధించిన చోటే వదిలేసినట్లు కథువా జిల్లా ఎస్పీ శైలేంద్ర మిశ్రా వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లా మన్యారి గ్రామస్థులు హిరానగర్ సెక్టార్ వద్ద దొరికిన ఒక పావురాన్ని ఆదివారం రోజున స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. అది పాకిస్థాన్‌ సరిహద్దు వైపు ఎగురుతుండగా పడిపోయిందని వారు తెలిపారు. దాని ఒంటి మీద గులాబి రంగులో గుర్తు, కాళ్లకు రింగ్, కొన్ని నంబర్లు ఉండటంతో పాక్‌ గూఢచార కపోతంగా పోలీసులు అనుమానించారు. 

ఇదిలా ఉండగా, అది తన పావురమేనంటూ పాకిస్థాన్‌కు చెందిన హబీబుల్లా అనే వ్యక్తి మీడియాకు వెల్లడించారు. దాన్ని విడుదల చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అలాగే దాని కాళ్లకు ఉన్న రింగు మీద నంబర్లు తన ఫోన్‌ నంబరని వెల్లడించారు. గూఢచర్యంపై వచ్చిన ఆరోపణలను తోపిపుచ్చుతూ, అదొక అమాయకమైన పక్షి అని తెలిపారు. అయితే ఆ పావురం ఇప్పుడు ఆయన చెంతకు చేరిందా? లేదా? అనే విషయం మాత్రం తెలియరాలేదు. కాగా, సరిహద్దుల వెంట ఉండే ప్రజలు సందేశాలు పంపుకోడానికి పక్షులను ఉపయోగిస్తారని ఆ పోలీసు అధికారి వెల్లడించారు. సాధారణంగా అయితే పక్షులను అనుమానించమని తెలిపారు.  అవి ఏ హెచ్చరిక లేకుండా వాటిపని అవి చేసుకుంటూ పోతాయి అని వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని