‘భారత సరిహద్దుల్లో చైనా బలగాలు’

ఇటీవల చైనా తమ సైనిక బలగాలను భారత సరిహద్దుల్లోకి తరలించిందని అమెరికా ‘సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌’ మైక్‌ పాంపియో తెలిపారు. కేవలం నియంతృత్వ ప్రభుత్వాలే ఇలాంటి చర్యలకు పాల్పడతాయని వ్యాఖ్యానించారు.......

Published : 02 Jun 2020 15:08 IST

డ్రాగన్‌ తీరును ఎండగట్టిన అమెరికా

వాషింగ్టన్‌: ఇటీవల చైనా తమ సైనిక బలగాలను భారత సరిహద్దుల్లోకి తరలించిందని అమెరికా ‘సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌’ మైక్‌ పాంపియో తెలిపారు. కేవలం నియంతృత్వ ప్రభుత్వాలే ఇలాంటి చర్యలకు పాల్పడతాయని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఈ అంశంలో భారత్‌కు మద్దతు పలికిన పాంపియో.. డ్రాగన్‌ దుశ్చర్యలను తప్పుబట్టారు. ఇటీవల తూర్పు లద్దాఖ్‌, ఉత్తర సిక్కిం ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ వెంట భారత్‌-చైనా సైనికులు తీవ్ర స్థాయిలో ఘర్షణకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో కొన్ని రోజులు ఉద్రిక్తలు కొనసాగాయి. ఈ ఘటనలో చైనా దుందుడుకుతనాన్ని నిర్ధారించిన పాంపియో.. హాంకాంగ్‌ స్వయం ప్రతిపత్తి, దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యం, కరోనా అంశాలను ప్రస్తావిస్తూ డ్రాగన్‌ తీరును ఎండగట్టారు. 

ఇప్పటికీ భారత సరిహద్దుల్లో బలగాల మోహరింపును చైనా కొనసాగిస్తూనే ఉందని పాంపియో గుర్తుచేశారు. కరోనా వైరస్‌ విషయంలో ప్రపంచానికి నిజాలు తెలియజేయడంలోనూ ఇంకా ఉదాసీనంగానే వ్యవహరిస్తోందన్నారు. హాంకాంగ్‌ ప్రజల స్వేచ్ఛకు తూట్లు పొడిచేందుకు సిద్ధమైందన్నారు. ఈ అంశాలు చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవహార శైలికి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమేనని.. మేధోహక్కులను కొల్లగొట్టడం, దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం కోసం ఇంకా యత్నిస్తుండడం వారి నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. వీటిని నిరోధించాల్సిన బాధ్యత, సామర్థ్యం అమెరికాకు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.

చైనా గత కొన్నేళ్లుగా ఇదే వైఖరిని ప్రదర్శిస్తోందని పాంపియో అన్నారు. వివిధ ప్రాంతాల్లో డ్రాగన్‌ తమ సైనిక స్థావరాల్ని ఏర్పాటు చేసుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు. ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌’ పేరిట వివిధ ప్రాంతాల్లో నౌకాశ్రయాల్ని నిర్మిస్తున్న అంశాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇవన్నీ తమ నావికా స్థావరాలుగా మార్చుకునేందుకు వ్యూహాలు పన్నుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని