కిమ్‌కు కోపం తెప్పించిన గాలిబుడగలు..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇకపై దక్షిణ కొరియాతో ఎలాంటి సమాచార మార్పిడి ఉండబోదని ప్రకటించారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్తులో......

Updated : 09 Jun 2020 12:26 IST

సియోల్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇకపై దక్షిణ కొరియాతో ఎలాంటి సమాచార మార్పిడి ఉండబోదని ప్రకటించారు. ఇరు దేశాల మధ్య భవిష్యత్తులో ఎలాంటి సీమాంతర సంబంధాలు ఉండబోవని చెప్పే దిశగా ఇది తొలి అడుగు అని ఉత్తర కొరియా అధికారిక ఛానల్‌ కేసీఎన్‌ఏ వెల్లడించింది. 

అమెరికా, ఉత్తర కొరియా మధ్య జరుగుతున్న అణు సంబంధిత చర్చల్లో ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సరిహద్దు మీదుగా వస్తున్న గాలిబుడగల కరపత్రాలను నిలువరించడంలో దక్షిణ కొరియా ప్రభుత్వం విఫలమైనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్యాంగ్యాంగ్‌లోని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం వెలువడడం వెనుక కిమ్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌దే ప్రధాన పాత్ర అని కేసీఎన్‌ఏ తెలిపింది.

ఏంటీ గాలిబుడగల కథ..?

సరిహద్దు మీదుగా దక్షిణ కొరియా నుంచి ఉత్తర కొరియాలోకి కొంతమంది గత కొన్నేళ్లుగా భారీ స్థాయిలో గాలిబుడగలు వదులుతున్నారు. కిమ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కరపత్రాలను వీటికి జతచేస్తుంటారు. ఉత్తర కొరియాలోని కన్జర్వేటివ్‌ కార్యకర్తలు, ఉత్తరం నుంచి దక్షిణంలోకి ప్రవేశించి ఆశ్రయం పొందుతున్న వారు వీటిని పంపుతుంటారని సమాచారం. ఈ అంశంపై ఇరు దేశాల మధ్య గత కొన్నిరోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ గాలిబుడగల రాక ఎక్కువైనట్లు ఉత్తర కొరియా ప్రభుత్వం తెలిపింది. దీనిపై కిమ్‌ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిలువరించకపోతే.. సరిహద్దులో ఇరు దేశాలకు చెందిన కార్యాలయాలను పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించారు. 2018 నాటి ‘ఇంటర్‌-కొరియన్‌’ సైనిక ఒప్పందాన్ని రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. దీనిపై స్పందించిన దక్షిణ కొరియా ఈ బుడగలపై నిషేధం విధిస్తామని ప్రకటించింది. అయినా, ఎలాంటి మార్పు లేకపోవడంతో కిమ్‌ తాజా నిర్ణయం తీసుకున్నారు. 2014లో తమ దేశంవైపు వస్తున్న ఈ గాలిబుడగలపై ఉత్తర కొరియా కాల్పులు జరిపింది. దీంతో ఇరు దేశాల మధ్య అప్పట్లో పరస్పరం కాల్పులు చోటుచేసుకున్నాయి.  

2019లో అమెరికా, ఉత్తరకొరియా మధ్య జరిగిన అణు సంబంధిత చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. నాటి నుంచి ఉత్తరకొరియాకు దక్షిణ కొరియా ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదు. మరోవైపు అమెరికాతో సంబంధాల్ని తెగతెంపులు చేసుకొనేందుకు దక్షిణ కొరియా నిరాకరించడంపై ఉత్తరకొరియా అనేక విమర్శలు చేసింది. అలాగే, ఇరు దేశాల మధ్య కుదిరిన ఉమ్మడి ప్రాజెక్టుల కొనసాగింపునకు ముందుకు రాకపోవడంపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని