ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ముష్కరుల హతం

జమ్మూ-కశ్మీర్‌లో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. షోపియాన్‌ జిల్లాలోని సుగూ గ్రామంలో ఈరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత 1:30 గంటలకు ఈ ఘటన జరిగింది.......

Updated : 10 Jun 2020 10:52 IST

శ్రీగనర్‌: జమ్మూ-కశ్మీర్‌లో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షోపియాన్‌ జిల్లాలోని సుగూ గ్రామంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ముష్కరులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా సిబ్బంది సుగూ గ్రామంలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో నక్కిన ముష్కరులు జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. వీరు ఏ ఉగ్రముఠాకు చెందివారన్నదానిపై పోలీసలు విచారణ జరుపుతున్నారు. మరికొందరు ముష్కరులు ఉండొచ్చనే అనుమానంతో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

షోపియాన్‌ జిల్లాలో ఆదివారం నాటి నుంచి ఇది మూడో ఎన్‌కౌంటర్‌. సోమవారం పింజోరాలో నలుగురు, ఆదివారం రెబన్‌లో ఐదుగురు ముష్కరుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఇవాళ్టి ఎన్‌కౌంటర్‌తో కలిపి ఇప్పటివరకు 12 మంది ముష్కరుల్ని సైన్యం హతమార్చింది.

15 రోజుల్లో 22 మంది హతం..

కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై గత కొన్ని రోజులుగా భారత సైన్యం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. గడిచిన 15 రోజుల్లో 22 మంది ముష్కరుల్ని మట్టుబెట్టింది. వీరిలో 8 మంది కమాండర్లు ఉన్నారు. మే 25న హంజీపొర కుల్గాం ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇస్లామిక్‌ స్టేట్‌ జమ్మూకశ్మీర్‌(ఐఎస్‌జేకే) కమాండర్‌ అదిల్‌ అహ్మద్‌ వానీ, లష్కరే తోయిబాకు చెందిన షహీన్‌ అహ్మద్‌ ఠోకర్‌ను బలగాలు అంతమొందించాయి. తర్వాతి రోజుల్లో జరిగిన వివిధ ఆపరేషన్లలో హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన టాప్‌ కమాండర్లు ఇష్ఫాక్‌ అహ్మద్‌, మంజూర్‌ అహ్మద్‌ కర్‌, జైషే మహ్మద్‌కు చెందిన ఓవైస్‌ అహ్మద్‌ మాలిక్‌, ఫౌజీ భాయ్‌ వంటి మరికొంత మంది కీలక ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది. వీరితో పాటు భారత్‌లోకి చొరబడుతూ మే 28న రాజౌరీ సెక్టార్‌లో చిక్కిన నలుగురిని, నౌషేరా సెక్టార్‌లో చిక్కిన ముగ్గురిని, కాలాకోటేలో పట్టుపడిన ఒకరిని సైన్యం హతమార్చింది. ఇలా ఈ ఏడాది భారత సైన్యం జరిపిన 36 ఆపరేషన్లలో ఇప్పటి వరకు 88 మంది ముష్కరుల్ని మట్టుబెట్టినట్లు జమ్మూకశ్మీర్‌ డీజీపీ దిల్‌బాగ్‌ సింగ్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని