ద.కొరియాకు కిమ్‌ సోదరి ఘాటు హెచ్చరిక!

దక్షిణ కొరియాపై గుర్రుగా ఉన్న ఉత్తర కొరియా తాజాగా ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దు మీదుగా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌కు వ్యతిరేకంగా వస్తున్న కరపత్రాల విషయంలో దక్షిణ కొరియా తీరు మార్చుకోకపోతే........

Updated : 14 Jun 2020 14:55 IST

సైనిక చర్యకు వెనకాడబోమని ప్రకటన

సియోల్‌: దక్షిణ కొరియాపై గుర్రుగా ఉన్న ఉత్తర కొరియా తాజాగా ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. సరిహద్దు మీదుగా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌కు వ్యతిరేకంగా వస్తున్న కరపత్రాల విషయంలో దక్షిణ కొరియా తీరు మార్చుకోకపోతే.. సైనిక చర్యకు వెనకాడమంటూ తీవ్రంగా హెచ్చరించింది. ఈ క్రమంలో దక్షిణ కొరియాను శత్రుదేశంగా పేర్కొనడం గమనార్హం. ఈ మేరకు కిమ్‌ సోదరి, ప్రస్తుతం ఉత్తర కొరియాలో అత్యంత శక్తిమంతమైన మహిళగా పేర్కొంటున్న కిమ్‌ యో జోంగ్‌ ప్రకటన విడుదల చేసినట్లు అక్కడి అధికారిక మీడియా కేసీఎన్‌ఏ కథనం ప్రచురించింది. 

‘‘అధినేత, పార్టీ, ప్రభుత్వం నుంచి దఖలుపడ్డ ప్రత్యేక అధికారాలను ఉపయోగించాను. శత్రుదేశం(దక్షిణ కొరియా)పై తీసుకోవాల్సిన తదుపరి చర్యల్ని అమలు చేయాలని సదరు విభాగాధిపతికి ఆదేశిలిచ్చాను. దేశ పౌరుల అసంతృప్తిని చల్లార్చేందుకు త్వరలోనే మా సైన్యం కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాను. ఆ దిశగా నేను ఎటువంటి సంకేతం ఇచ్చినా ఇక తదుపరి నిర్ణయం ఆర్మీ చీఫ్‌ చేతిలోకి వెళ్లిపోతుంది ’’ అని తన ప్రకటనలో కిమ్‌ యో జోంగ్‌ పేర్కొన్నారు. అలాగే, సరిహద్దులో ఇరు దేశాలకు చెందిన అనుసంధాన కార్యాలయాల్ని మూసివేస్తామని కూడా హెచ్చరించారు. 

కిమ్‌ యో జోంగ్‌ తాజా ప్రకటనలు చూస్తుంటే ఉత్తర కొరియా ప్రభుత్వంలో ఆమె పాత్ర అత్యంత శక్తిమంతంగా మారుతున్నట్లు అర్థమవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్‌ ఆరోగ్యంపై రెండు నెలల కిందట అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనూ తదుపరి అధినేత్రి కిమ్‌ యో జోంగేనని వార్తలు వినిపించాయి. తాజాగా ఆమె ఘాటు ప్రకటనలు బట్టి చూస్తే ప్రభుత్వ వ్యవహరాల్లో ఆమె పాత్ర ఎంత కీలకంగా మారిందో తెలుస్తోంది. దక్షిణ కొరియాకు సంబంధించిన అన్ని వ్యవహారాల్ని ప్రస్తుతం ఆమే పర్యవేక్షిస్తున్నట్లు కేసీఎన్‌ఏ వెల్లడించింది. 

దక్షిణ కొరియాతో అన్నిరకాల సంబంధాలను తెంచేసుకుంటున్నట్టు గత మంగళవారమే ఉత్తర కొరియా ప్రకటించింది. తమ దేశానికి వ్యతిరేకంగా కరపత్రాలను, బుడగలను జారవిడుస్తున్నా... వాటిని నిలువరించడంలో ద.కొరియా విఫలమైందని, అందుకే ఈ చర్య చేపడుతున్నామని పేర్కొంది. లాభదాయకమైన కొరియాల అంతర్గత ఆర్థిక ప్రాజెక్టులను పునరుద్ధరించడంలోనూ, ఆంక్షల సడలింపు దిశగా అమెరికాను ఒప్పించడంలోనూ దక్షిణ కొరియా విఫలం కావడం కూడా ఈ నిర్ణయానికి దారితీశాయని నిపుణులు భావిస్తున్నారు.

ఇరు దేశాల మధ్య నెలకొన్న తాజా పరిస్థితులపై ఆదివారం దక్షిణ కొరియా అత్యవసర సమావేశం నిర్వహించింది. ఉభయుల మధ్య కుదిరిన అన్నిరకాల సయోధ్య ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని ఉ.కొరియాను కోరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని