బీజింగ్‌లో పరిస్థితి తీవ్రరూపం!

కరోనా వైరస్‌ మహమ్మారి పుట్టిన చైనాలో తాజాగా మరోసారి వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. తొలుత వుహాన్‌ను వణికించిన ఈ మహమ్మారి...

Updated : 16 Jun 2020 14:56 IST

కరోనా తీవ్రరూపం దాల్చిందని అధికారుల హెచ్చరిక
నగరం నుంచి బయటకు వెళ్లడంపై నిషేధం

బీజింగ్‌: కరోనా మహమ్మారి పుట్టిన చైనాలో తాజాగా మరోసారి వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. తొలుత వుహాన్‌ను వణికించిన ఈ మహమ్మారి తాజాగా దేశ రాజధాని బీజింగ్‌పై పడగవిప్పింది. నగరంలో ఉన్న అతిపెద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌ షిన్‌ఫడి తాజాగా వైరస్‌కు కేంద్ర బిందువైంది. నిత్యం పదుల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు బయటపడుతుండటంతో బీజింగ్‌లో పరిస్థితులు తీవ్రరూపం దాల్చినట్లు నగర అధికారులు హెచ్చరిస్తున్నారు.

రాజధాని నగరంలో కేవలం మంగళవారం ఉదయమే కొత్తగా 27కేసులు బయటపడ్డాయి. నగరంలో గడిచిన ఐదు రోజుల్లోనే పాజిటివ్‌ కేసుల సంఖ్య 106కి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు నగరంలోని 30ప్రాంతాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించారు. నిత్యం వేల మంది సందర్శించే ఈ మార్కెట్‌ తాజాగా వైరస్‌ వ్యాప్తికి కేంద్రబిందువుగా మారింది. దీంతో లక్షల సంఖ్యలో నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించిన అధికారులు, ఇప్పటికే పరీక్షలను ముమ్మరం చేశారు. రాజధానిలో పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో అన్ని ఆహార కేంద్రాలు, రెస్టారెంట్లు, ప్రభుత్వ క్యాంటీన్లలో పనిచేసే వారితోపాటు వాటి నిర్వాహకులకు వైద్యపరీక్షలు చేస్తున్నట్లు బీజింగ్‌ నగర అధికార ప్రతినిధి ఝూ హెజియన్‌ వెల్లడించారు. రానున్న రోజుల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు పెంచే కొద్దీ పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇతర నగరాలకు రాకపోకలు నిషేధం..

తాజాగా ఈ మహమ్మారి వ్యాప్తికి బీజింగ్‌ కేంద్రబిందువుగా మారడంతో నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లడంపై నిషేధం విధించారు. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా టాక్సీలు, ఇతర వాహన సర్వీసులను నగరం బయటకు వెళ్లకుండా నిషేధించినట్లు అక్కడి రవాణాశాఖ అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా, గత కొన్నిరోజులుగా బీజింగ్‌ను పర్యటించిన ఇతర నగరవాసులు హోం క్వారంటైన్‌లోనే ఉండాలని చైనా మొత్తం ప్రకటించారు. వీటికితోడు నగరంలోని క్రీడా మైదానాలు, వినోద ప్రాంతాలు మూసివేయాలని ఆదేశించారు.

మరిన్ని వైరస్‌ క్లస్టర్ల గుర్తింపు..

బీజింగ్‌ అతిపెద్ద హోల్‌సేల్‌ మార్కెట్‌కు రోజుకు వేల సంఖ్యలో వివిధ నగరాల నుంచి వస్తుంటారు. గడచిన 15రోజుల్లో దాదాపు 2లక్షల మంది ఈ మార్కెట్‌ను సందర్శించినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో నగరంలోని 11 మార్కెట్లను కూడా ఇప్పటికే మూసివేసిన అధికారులు, దాదాపు 276 వ్యవసాయ మార్కెట్లను శుద్ధిచేసే కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే ఆయా మార్కెట్లో పనిచేస్తోన్న పదివేల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేపట్టారు. తాజాగా ఈ మార్కెట్‌కు సంబంధం ఉన్న సమీప ప్రావిన్సుల్లో కూడా వైరస్‌ వ్యాప్తి మొదలైనట్లు చైనా నేషనల్‌ హెల్త్‌ కమిషన్‌ గుర్తించింది.

రోజుకు 90వేల పరీక్షల సామర్థ్యం..

దేశ రాజధానిలో తాజాగా బయటపడుతున్న కేసులతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే వుహాన్‌లో దాదాపు కోటి మందికి పరీక్షలు చేపట్టిన అధికారులు, బీజింగ్‌లో కూడా ఇదే తరహా పరీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. దీంతో రోజుకు 90వేల మందిని పరీక్షించే సామర్థ్యంతో సిద్ధంగా ఉన్నట్లు చైనా అధికార వార్తా ఏజెన్సీ వెల్లడించింది.

హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

తాజాగా బీజింగ్‌ పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆవేదన వ్యక్తం చేసింది. అత్యధిక జనాభా, అధిక రాకపోకలు సాగించే నగరంలో తాజాగా క్లస్టర్లు ఏర్పడడంతో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే, గతరెండు నెలల్లో ఒక్కకేసు కూడా నమోదుకాని నగరంలో ఒక్కసారిగా వైరస్‌ విజృంభణకు కారణాలను విశ్లేషించే పనిలో చైనా అధికారులు నిమగ్నమ్యయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని