పొగబెట్టి.. ఉగ్రవాదులను వెలికి రప్పించి..!

గత 24 గంటల్లో జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా బలగాలు ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లాలోని పాంపోర్‌, షోపియాన్‌ ప్రాంతాల్లో ఉగ్రవాదులు.........

Published : 20 Jun 2020 01:39 IST

కశ్మీర్‌లో 8మంది ముష్కరులు హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో గత 24 గంటల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో భద్రతా బలగాలు ఎనిమిది మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి.  పుల్వామా జిల్లాలోని పాంపోర్‌, షోపియాన్‌ ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఉన్నట్లు గురువారం పక్కా సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు వెంటనే రంగంలోకి దిగి నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. 

పాంపోర్‌లో ముగ్గురు ముష్కరులు ఓ ఇంట్లో నక్కి ఉండటాన్ని గమనించిన దళాలు ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టాయి. ముష్కరులు కాల్పులకు తెగబడడంతో భద్రతా దళాలు ఎదుదాడిని ప్రారంభించాయి. దీంతో ఓ ఉగ్రవాది అక్కడికక్కడే హతమయ్యాడు. మరో ఇద్దరు తప్పించుకొని ఓ మసీదులోకి చొరబడ్డారు. దీంతో రాత్రివేళ బలగాలు ఆ మసీదును చుట్టుముట్టాయి. ముష్కరులు ఎంతకూ బయటకు రాకపోవడంతో శుక్రవారం తెల్లవారుజాము సమయంలో టియర్‌ గ్యాస్‌ షెల్స్‌ ప్రయోగించారు. దట్టమైన పొగ అలుముకోవడంతో మసీదు వెలుపలికి వచ్చిన ముష్కరులు బలగాలపైకి కాల్పులు ప్రారంభించారు. ఎదురుకాల్పులు జరిపిన దళాలు వారిని అక్కడికక్కడే అంతమొందించాయి. మసీదు పవిత్రతకు ఎలాంటి భంగం కలిగించకుండానే ముష్కరుల్ని మట్టుబెట్టినట్లు కశ్మీర్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. 

ఇక షోపియాన్‌ ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో గురువారం సాయంత్రం నుంచి ఐదుగురు ముష్కరుల్ని మట్టుబెట్టారు. వీరంతా ఏ ఉగ్రసంస్థకు చెందిన వారన్నదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

గత కొన్నిరోజులుగా కశ్మీర్‌లో ఉగ్రవాదులపై బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. గత రెండు వారాల వ్యవధిలో దాదాపు 25 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అంతకుముందుకు హిజ్బుల్‌ ముజాహిదీన్‌, లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌కు చెందిన కీలక కమాండర్లను సైన్యం అంతమొందించిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని