బీజింగ్‌లో వాటికీ కరోనా పరీక్షలు

ఆహార పదార్థాలు, వాటిని డెలివరీ చేసే వ్యక్తులపై చైనా రాజధాని బీజింగ్‌ ప్రభుత్వం దృష్టి సారించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు..

Published : 21 Jun 2020 01:10 IST

బీజింగ్: ఆహార పదార్థాలు, వాటిని డెలివరీ చేసే వ్యక్తులపై చైనా ప్రభుత్వం దృష్టి సారించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు బీజింగ్ అధికారులు ఆహార పదార్థాలు, పార్సిల్ డెలివరీ సిబ్బందికి న్యూక్లియిక్ యాసిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారని అధికారిక బీజింగ్ న్యూస్ పేర్కొంది. వారం క్రితం బీజింగ్‌లోని జిన్‌ఫడి ఆహార హోల్‌సేల్ మార్కెట్‌లో కొత్తగా కరోనా కేసులు నమోదవడంతో 20 మిలియన్ల జనాభా ఉన్న నగరంలో అధికారులు పరీక్షలను విస్తరిస్తున్నారు. మొదట్లో ఆ మార్కెట్ సమీపంలోని నివాస ప్రాంతాలు, మార్కెట్‌లో పనిచేసినవారు, ఆ ప్రాంతంలో షాపింగ్ చేసిన వ్యక్తులపై దృష్టి పెట్టారు.

ప్రస్తుతం నగరంలోని రెస్టారెంట్ సిబ్బంది, క్యాటరింగ్‌లో పనిచేసే వ్యక్తులతో పాటు దిగుమతి చేసుకున్న ఆహారాన్ని అధికారులు పరీక్షిస్తున్నారు. దీంతోపాటు నగరంలో నిత్యం ప్రయాణించే పదివేల మంది డెలివరీ సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తోంది. దేశంలోనే రెండో అతిపెద్ద కొరియర్ సంస్థ అయిన ఎస్‌ఎఫ్‌ ఎక్స్‌ప్రెస్‌ కార్మికులకు శుక్రవారం సాయంత్రం బీజింగ్‌లోని టెస్టింగ్ పాయింట్ల వద్ద పరీక్షలు నిర్వహించారు. ఫుడ్ డెలివరీ సంస్థ మీతువాన్ డయాన్‌పింగ్ శుక్రవారం ఫుడ్‌ డెలివరీ సిబ్బందిని పరీక్షించనున్నట్లు  ధ్రువీకరించింది. వైరస్‌ ఉద్ధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో డెలివరీలు చేసిన వారిని పరీక్షల అనంతరం 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉంచనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం కొత్తగా 22 కేసులు నమోదైన బీజింగ్‌లో ప్యాకేజింగ్ ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదాన్ని అధికారులు ఎత్తిచూపారు. నగరంలో జూన్ 11 నుండి 200కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని