సానుకూలంగా భారత్-చైనా డబ్ల్యూఎంసీసీ చర్చలు

సరిహద్దు వివాదానికి సంబంధించి నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించేందుకు జూన్‌ 6న మిలిటరీ కమాండర్ల మధ్య జరిగిన అవగాహన ఒప్పందాన్ని రెండు దేశాలు....

Published : 25 Jun 2020 02:42 IST

జూన్‌ 6న సమావేశ నిర్ణయాల అమలుకు అంగీకారం

దిల్లీ: సరిహద్దు వివాదానికి సంబంధించి నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించేందుకు జూన్‌ 6న మిలిటరీ కమాండర్ల మధ్య జరిగిన అవగాహన ఒప్పందాన్ని రెండు దేశాలు నిబద్ధతతో అమలు చేయాలని వర్కింగ్ మెకానిజమ్‌ ఫర్‌ కన్సల్టేషన్ అండ్‌ కో-ఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) సమావేశంలో భారత్-చైనాలు నిర్ణయించాయి. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇరు దేశాల విదేశాంగ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూర్పు లద్దాఖ్‌లోని ఇటీవలి పరిణామాలపై భారత్ తన ఆందోళనను చైనాకు తెలియజేసింది.

ప్రస్తుత పరిస్థితులను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు, ఇరు దేశాలు ద్వైపాక్షిక, సైనిక స్థాయిలో ఒకరికొకరు సహరించుకుంటూ కలిసి పనిచేసేందుకు అంగీకరించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అలానే వాస్తవ నియంత్రణ రేఖను భారత్-చైనా తప్పకుండా గౌరవించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ‘‘ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఇరు దేశాల ప్రతినిధులు గతంలో జరిగిన అవగాహన మేరకు వాటిని వేగవంతంగా అమలుచేసేందుకు అంగీకరించారు. ఇది సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు, రెండు దేశాల మధ్య విస్తృతస్థాయి సంబంధాలను నెలకొల్పేందుకు సహాయపడుతుంది’’ అని డబ్ల్యూసీసీ చర్చల అనంతరం విదేశాంగశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

గత నెలలో తూర్పు లద్దాఖ్‌లోని నాలుగు సరిహద్దు ప్రాంతాల్లో చైనా భారీగా బలగాలను మోహరించి ఆక్రమణకు ప్రయత్నించడంతో భారత్ సైనికులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. వీటిని తగ్గించేందుకు జూన్‌ 6న కమాండర్‌ స్థాయి అధికారులు చర్చలు జరిపి ఇరు దేశాలు ఆయా ప్రాంతాల నుంచి వెనక్కి వెళ్లాలని నిర్ణయించాయి. అయితే జూన్‌ 15న గల్వాన్‌ లోయలో చైనా అక్రమంగా నిర్మించిన శిబిరాలను భారత్ బలగాలు కూల్చివేశాయి. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ ఘటనలో నిరాయుధులైన భారత సైనికులపై చైనా బలగాలు ఇనుప రాడ్డులు, కర్రలు, రాళ్లతో దాడి చేశాయి. ఈ దాడిని భారత్ బలగాలు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ కర్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. మరో 70 మంది వరకు గాయపడ్డారు. అయితే  ఈ ఘటన అనంతరం తాజాగా జరిగిన చర్చల్లో వివాదాస్పద ప్రాంతం నుంచి ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకునేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఘర్షణకు కారణం భారత బలగాలు అనే చైనా తొండి వాదనలో మాత్రం ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని