బిన్‌ లాడెన్‌ అమర వీరుడు: ఇమ్రాన్‌ వ్యాఖ్య

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని వణికించిన......

Published : 25 Jun 2020 22:00 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని వణికించిన అల్‌ఖైదా వ్యవస్థాపకుడు, అమెరికా ట్విన్‌ టవర్స్‌ కూల్చివేతలో ప్రధాన సూత్రధారి ఒసామా బిన్‌ లాడెన్‌ని అమరవీరుడుంటూ కీర్తించారు. పాకిస్థాన్‌ పార్లమెంట్‌లో ప్రసంగించిన ఇమ్రాన్‌.. ‘‘అమెరికన్లు వచ్చి ఒసామా బిన్‌ లాడెన్‌ను అబొట్టాబాద్‌లో చంపేశారు.. అమరుడిని చేశారు. మనం చాలా ఇబ్బంది పడ్డాం’’ అని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

పాకిస్థాన్‌ ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండానే అమెరికా సైన్యం దేశంలోకి ప్రవేశించి లాడెన్‌ను చంపేశాయంటూ ఇమ్రాన్‌ విమర్శించారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలు పాకిస్థాన్‌ను నిందించాయనీ.. దీంతో తాము ఇబ్బంది పడ్డామన్నారు. 2011లో అమెరికా సైనిక బలగాలు అబొట్టాబాద్‌లోని గారిసన్‌ పట్టణంలో ఒసామా బిన్‌ లాడెన్‌ను హతమార్చిన విషయం తెలిసిందే. 2001 సెప్టెంబర్‌ 11న అమెరికాలోని ట్విన్‌ టవర్‌ కూల్చివేత ఘటన వెనుక ప్రధాన సూత్రధారి లాడెనే. ఇలాంటి తన ఉగ్రవాద కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగించి అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను గజగజ వణికించాడు. అలాంటి కరడు గట్టిన ఉగ్రవాదిని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మాత్రం అమర వీరుడంటూ కీర్తించడం గమనార్హం. 

లాడెన్‌కు అనుకూలంగా వ్యవహరించడం ఇమ్రాన్‌కు ఇదే తొలిసారి కాదు. గతంలో పాక్‌ ప్రధాని కావడానికి ముందు కూడా ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వ్యూలో లాడెన్‌ను ఉగ్రవాది సంబోధించేందుకు ఆయన నిరాకరించారు. అంతేకాదు ఆయన అమెరికా తొలి అధ్యక్షుడిగా పనిచేసిన జార్జ్‌ వాషింగ్టన్‌తో సమానమన్నాడు. అలాగే, ఆయన బ్రిటిష్‌వాళ్లకు ఉగ్రవాదనీ.. ఇతరులకు స్వాతంత్ర్య సమరయోధుడంటూ కొనియాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని