ఉగ్ర ఉక్కును తుక్కు చేసే కవచాలు

సాధారణ రక్షణ కవచాలనూ ఛిద్రం చేసే ఉక్కు తూటాలు మరోసారి ఉగ్రవాదుల

Published : 22 Mar 2021 10:56 IST

 స్టీలు తూటాలను తట్టుకొనేలా అదనపు రక్షణ 
కశ్మీర్‌లో ముష్కర కుతంత్రాలకు భద్రతా దళాల విరుగుడు 

శ్రీనగర్‌/ దిల్లీ: సాధారణ రక్షణ కవచాలనూ ఛిద్రం చేసే ఉక్కు తూటాలు మరోసారి ఉగ్రవాదుల వద్ద వెలుగు చూసిన నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్‌లో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. తమ వాహనాలు, బంకర్లకు అమర్చిన బులెట్‌ ప్రూఫ్‌ కవచాలను మరింత పటిష్ఠం చేస్తున్నాయి. కొద్ది రోజుల కిందట దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలు నిషిద్ధ జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాద ముఠా స్థానిక కమాండర్‌ విలాయత్‌ హుస్సేన్‌ లోన్‌ అలియాస్‌ సజ్జాద్‌ అఫ్గానీని హతమార్చాయి. ఘటనా స్థలం నుంచి 36 రౌండ్ల స్టీల్‌ కోర్‌ తూటాలను స్వాధీనం చేసుకున్నాయి. ఇది ఉన్నతాధికారుల్లో కలవరం సృష్టించింది. సాధారణంగా ఉగ్రవాదులు ఉపయోగించే తూటాలకు సీసపు కోర్‌ ఉంటుంది. దానిపై కొద్దిగా ఉక్కు పొర ఉంటుంది. అవి తూటా రక్షణ కవచాలను ఛేదించలేవు. ఉక్కు తూటాలు దానికి భిన్నమైనవి, చాలా శక్తిమంతమైనవి. దృఢమైన ఉక్కు లేదా టంగ్‌స్టన్‌ కార్బైడ్‌తో వాటిని తయారుచేస్తారు. చైనా సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పాకిస్థాన్‌లో ఈ తూటాలను రూపొందిస్తున్నారని అధికారులు చెప్పారు. వీటిని ‘ఏకే శ్రేణి’ తుపాకుల్లో ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. 2017 డిసెంబరు 31న దక్షిణ కశ్మీర్‌లోని లెథ్‌పొరా సీఆర్పీఎఫ్‌ శిబిరంపై జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడి ఘటనలో ఇవి తొలిసారిగా బయటపడ్డాయి. ఆ దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది చనిపోగా.. ఒకరికి ఈ తూటా తగిలింది. సాధారణ బులెట్‌ ప్రూఫ్‌ రక్షణ కవచాన్ని ఛిద్రం చేసుకుంటూ అతడి శరీరంలోకి ఇది దూసుకెళ్లింది. ఈ ఘటనతో భద్రతా దళాలు పలు జాగ్రత్తలు తీసుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఆ తూటాలు వెలుగు చూడటంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. దక్షిణ కశ్మీర్‌లో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో పాలుపంచుకునే వాహనాలు, భద్రతా సిబ్బంది ఉపయోగిస్తున్న రక్షణ కవచాలకు అదనపు పొరలను జోడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని