Retirement: రిటైరైనా గీత దాటొద్దు!

రక్షణ, ఇంటెలిజెన్స్‌ రంగాలకు చెందిన 25 విభాగాల అధికారులు రిటైరైన తర్వాత కూడా సున్నితమైన అంశాలను

Published : 03 Jun 2021 23:55 IST

 ఇంటెలిజెన్స్, రక్షణ విభాగాల్లోని ఉద్యోగులకు నిర్దేశం

  సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనలు మార్చిన కేంద్రం


 

దిల్లీ: రక్షణ, ఇంటెలిజెన్స్‌ రంగాలకు చెందిన 25 విభాగాల అధికారులు రిటైరైన తర్వాత కూడా సున్నితమైన అంశాలను వెల్లడించకుండా కేంద్రం కట్టడి చేసింది. ఆయా విభాగాల్లో పనిచేసి రిటైరైన తర్వాత ఆర్టికల్స్‌గాగానీ, పుస్తకాలుగాగానీ సంచలనమైన సున్నిత విషయాలను వెల్లడించకుండా ఈ చర్య తీసుకున్నారు. ‘‘ఆయా సంస్థల్లో పనిచేసే వారు తాము పనిచేసిన సంస్థలకు సంబంధించిన, లేదా వ్యక్తుల వివరాలను వెల్లడించొద్దు.  అలాంటి సమాచారాన్ని ప్రచురించాలనుకుంటే సంస్థ ఉన్నతాధికారి నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది’’ అని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సివిల్‌ సర్వీసెస్‌ (పెన్షన్‌) సవరణ నిబంధనలను కేంద్రం ప్రకటించింది.

ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), రీసెర్చి అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ), బీఎస్‌ఎఫ్, డీఆర్‌డీఓ, ఎన్‌ఐఏ, డీఆర్‌ఐ, సీఈఐబీ, ఈడీ, ఏవియేషన్‌ రీసెర్చ్‌ సెంటర్, సీఆర్‌పీఫ్, సీఐఎస్‌ఎఫ్‌లతో పాటు... మొత్తం 25 సంస్థల అధికారులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. వీటిని ఉల్లంఘించిన వారికి పింఛన్‌ను నిలిపేస్తారు లేదా... వెనక్కి తీసుకుంటారు. ఆయా సంస్థల్లో పనిచేసే అధికారులు రిటైరైన తర్వాత కూడా భారత దేశ సార్వభౌమతాన్ని దెబ్బతీసే సమాచారాన్ని పబ్లిష్‌ చేయటానికి వీల్లేదని 2008లోనే సవరించిన నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే, తమ విభాగ ఉన్నతాధికారి ముందస్తు అనుమతి ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఈసారి ఈ ముందస్తు అనుమతి అధికారాన్ని విభాగపు అధికారి నుంచి... సంస్థ ఉన్నతాధికారికి అప్పగించారు. మరికొన్ని నిబంధనలను చేర్చారు. ‘సమాచార హక్కు చట్టంలోని రెండో షెడ్యూల్‌ కింద చేర్చిన 25 ఇంటెలిజెన్స్, రక్షణ సంబంధ సంస్థలకు ఈ సవరించిన ఉత్తర్వులు వర్తిస్తాయి. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ సవరణలన్నీ! ముందస్తు అనుమతికి దరఖాస్తు చేసుకుంటే వారు వెల్లడించేది సున్నితమైన అంశమా కాదా అనేది తేలిపోతుంది’ అని అధికారవర్గాలు వివరించాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని