Jeff bezos: అంతరిక్ష యాత్రపై వింత పిటిషన్‌

అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న వేళ అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated : 22 Jun 2021 10:53 IST

భూమ్మీదకు తిరిగి రావద్దని వేల మంది సంతకాలు

వాషింగ్టన్‌:  అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్న వేళ అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోదసి నుంచి ఆయన మళ్లీ భూమ్మీదకు రావొద్దనే పిటిషన్‌పై ఇప్పటికే 33 వేలకు పైగా మంది సంతకం చేశారు. జెఫ్‌ బెజోస్‌.. తన సోదరుడు మార్క్‌తో కలిసి జులై 20న అంతరిక్ష యాత్రకు బయలుదేరనున్నారు. సొంత సంస్థ ‘బ్లూ ఆరిజన్‌’ తొలిసారి చేపట్టబోయే.. మానవ సహిత రోదసి యాత్రలో వీరిద్దరూ పాల్గొంటున్నారు. అయితే, ఈ యాత్రపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేల మంది ఏకమై    బెజోస్‌ మళ్లీ భూమికి తిరిగి రాకూడదని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందు కోసం రూపొందించిన ఆన్‌లైన్‌ పిటిషన్‌లో పెద్ద ఎత్తున తమ సంతకాలతో మద్దతు తెలుపుతున్నారు. ఈ యాత్రకు సంబంధించి అనేక పిటిషన్‌లు ఉన్నప్పటికీ.. అందులో జెఫ్‌ బెజోస్‌ మళ్లీ భూమి పైకి రాకూడదనే దానిపై ఎక్కువ మంది సంతకాలు చేశారు.

సీల్డ్‌ బిడ్డింగ్‌ పద్ధతిలో..

బ్లూ ఆరిజన్‌కు చెందిన సొంత వ్యోమనౌక ‘న్యూ షెపర్డ్‌’లో తొలియాత్ర జరగనుండగా.. ఇందులో సీటు కోసం ఆ సంస్థ ఆన్‌లైన్‌లో సీల్డ్‌ బిడ్డింగ్‌ పద్ధతిలో వేలం నిర్వహించింది. చివరి విడత వేలం ఈ నెల 12న జరిగింది. అత్యధికంగా రూ.20.79 కోట్ల(28 లక్షల డాలర్ల) బిడ్‌ వచ్చింది. ఇందులో అత్యధిక మొత్తం బిడ్‌ వేసిన వ్యక్తి, బెజోస్, ఆయన సోదరుడు ఈ అంతరిక్ష విహారం చేయనున్నారు. వీరి యాత్ర వినూత్న పర్యాటకానికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. రోదసిలో తమ ఉనికి చాటుకోవాలని ప్రయత్నిస్తున్న వారిలో బిలియనీర్‌ బెజోస్‌ ఒక్కరే కాదు.. టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్, వర్జిన్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌ వంటివారూ ఉన్నారు.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని