Biden: టీకాల లక్ష్య సాధన ఎలా?

బద్ధకస్థులు, సందేహాల జీవులతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పెద్ద తలనొప్పే ఎదురవుతోంది.

Published : 25 Jun 2021 20:24 IST

బైడెన్‌ ప్రభుత్వం కసరత్తు
అమెరికా యువతలో పెరుగుతున్న నిర్లిప్తత

వాషింగ్టన్‌: బద్ధకస్థులు, సందేహాల జీవులతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు పెద్ద తలనొప్పే ఎదురవుతోంది. కరోనా టీకాలు వేసుకోవడానికి వారెవరూ ముందుకు రాకపోవడం ఇబ్బందికరంగా మారింది. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవమైన జులై నాలుగు నాటికి 70 శాతం మందికి టీకాలు వేయడం పూర్తికావాలని మే 4న బైడెన్‌ లక్ష్యంగా పెట్టారు. ఆ రోజున ఆయన అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడుతూ ‘‘ఇది జీవన్మరణ సమస్య. మొత్తం 100% మందికి టీకాలు వేయాలని అనుకున్నాం. వాస్తవాలను గమనించి దాన్ని 70 శాతానికే పరిమితం చేశాం’’ అని చెప్పారు. అయితే అది నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. బుధవారం నాటికి 65.6% మందికి కనీసం ఒక డోసు టీకా లభించింది. జులై 4 నాటికి 67 శాతం మంది వ్యాక్సిన్‌ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అధికారం చేపట్టిన 100 రోజుల్లో 10 కోట్ల మందికి టీకాలు వేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా, దాన్ని అధిగమించి ఏకంగా 20 కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇచ్చారు. ఇప్పుడు మాత్రం నానా తంటాలు పడాల్సి వస్తోంది. 

నిర్లిప్తతే అసలు కారణం 

‘టీకా తీసుకోవడం ఇప్పుడు అంత అత్యవసరమా?’ అన్న ధోరణే లక్ష్యం చేరుకోవడానికి ప్రధాన ఆటంకంగా మారిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. చాలామందిలో ఈ నిర్లిప్తత కనిపిస్తోందని అంటున్నారు. టీకాల కోసం ఎన్నో దేశాల వారు ఆత్రుతగా ఎదురు చూస్తున్న తరుణంలో, అమెరికా వాసుల్లో ఈ స్థాయి నిర్లిప్తత ఉంటుందని ఊహించలేదని చెబుతున్నారు. తొలి దశలో టీకాల కార్యక్రమానికి భారీ స్పందన కనిపించింది. దానివల్ల కేసులు, మరణాలు అదుపులోకి వచ్చాయి. చాలా రాష్ట్రాలు ఆంక్షలు ఎత్తివేశాయి. వ్యాపార సంస్థలు, పాఠశాలలు ఎప్పటిలాగానే నడుస్తున్నాయి. ఎక్కడికక్కడ జన సమూహాలు కనిపిస్తున్నాయి. దాంతో ఇప్పుడు టీకాల అవసరం పెద్దగా లేదన్న భావన పెరిగిందని, దీనిపై ప్రజలకు నచ్చజెప్పడం కష్టంగా మారిందని అంటున్నారు. ముఖ్యంగా యువకుల్లో ఇలాంటి ఆలోచన ధోరణి ఎక్కువగా ఉంది. ‘‘ట్రంప్‌ అభిమానులైన యువ ఓటర్లు టీకాలపై ఆసక్తి చూపడం లేదు. వారు దీన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారు. తమకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉందని చెప్పుకోవడానికి కూడా టీకాలు వేసుకోవడం లేదు’’ అని రిపబ్లికన్‌ పార్టీ రాజకీయ విశ్లేషకుడు ఫ్రాంక్‌ లాంజ్‌ చెప్పారు.

రంగంలోకి అధ్యక్షుడు 

పరిస్థితిని గమనించిన బైడెన్‌ స్వయంగా రంగంలో దిగారు. దేశవ్యాప్తంగా ‘కార్యాచరణ మాసం’ నిర్వహిస్తామని ప్రకటించారు. ‘చొక్కా చేతులు పైకి లాగండి’ అంటూ పిలుపునిచ్చారు. స్థానికంగా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. రాష్ట్రాల మధ్య భారీగా తేడాలు ఉండడంతో దాన్ని సరిచేయాలని నిర్ణయించారు. వెర్మోంట్‌ రాష్ట్రంలో 80 శాతం మంది టీకాలు వేసుకున్నారు. మిస్సోరిలో ఈ సంఖ్య 40 శాతానికి మించలేదు. 13% దాటని రాష్ట్రం కూడా ఉంది. కరోనా వైరస్‌లోనూ మార్పులు వస్తున్నందున వాటివల్ల కలిగే ముప్పుపై ప్రజలకు అవగాహన కలిగించాల్సి ఉందని అధికారులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని