Rajnath: కవ్విస్తే.. కఠిన చర్యలే

భారత్‌ ఎన్నడూ ఆక్రమణలకు పాల్పడదని, కానీ ఎవరైనా కవ్వించాలని ప్రయత్నిస్తే తగిన

Updated : 29 Jun 2021 11:34 IST

 చైనాకు రాజ్‌నాథ్‌ హెచ్చరిక

దిల్లీ: భారత్‌ ఎన్నడూ ఆక్రమణలకు పాల్పడదని, కానీ ఎవరైనా కవ్వించాలని ప్రయత్నిస్తే తగిన సమాధానం ఇవ్వడానికి సర్వసన్నద్ధంగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టంచేశారు. సోమవారం తూర్పు లద్దాఖ్‌లోని యుద్ధక్షేత్రానికి సమీపంలో సైనికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆ ప్రాంతానికి వెళ్లిన ఆయన రెండో రోజున సైనికులను కలిశారు. తన ప్రసంగంలో చైనాకు సూటిగా సందేశం ఇచ్చారు. ‘‘భారత్‌ శాంతికాముక దేశం. ఎవర్నీ ఎప్పుడూ బెదిరించలేదు. ఎవరైనా బెదిరిస్తే సహించబోదు. ఉత్తర సరిహద్దులో గత ఏడాది పెద్ద సవాళ్లను ఎదుర్కొన్నాం. ప్రతి సవాలుకు మన సైన్యం జవాబు ఇచ్చింది. ధైర్యం, అంకిత భావాన్ని ప్రదర్శించింది. పొరుగువారం ఎప్పటికీ ఇరుగుపొరుగువారిగానే ఉంటాం. సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి’’ అని అన్నారు. ఈ ప్రాంతంలో బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) నిర్మించిన 63 వంతెనలను ప్రారంభించారు. లద్దాఖ్‌ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, అందుకే దీన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిందని తెలిపారు. లద్దాఖ్‌లో కూడా రాజకీయ ప్రక్రియ మొదలుకావాలని ప్రధాని కోరుకుంటున్నారని, ఇక్కడివారితో ఆయన త్వరలో మాట్లాడుతారని అన్నారు. జమ్మూ-కశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన తరువాత ఇక్కడ ఉగ్రవాద చర్యలు బాగా తగ్గాయని తెలిపారు. దేశ భద్రతకు ప్రోత్సాహం ఇచ్చినట్టయిందని అన్నారు. మౌలిక వసతుల కల్పనలో బీఆర్‌ఓ చేస్తున్న కృషిని ప్రశంసించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని