US: పశ్చిమ అమెరికా భగభగ! 

ఏసీలు సరిపోవటం లేదు... రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోయాయి... మున్సిపాలిటీ సరఫరా చేసే మంచినీరు తగ్గించేశారు... అమెరికాలో తాజా దృశ్యాలివి! వేసవికాలం ఆరంభంలోనే అమెరికాను ముఖ్యంగా పశ్చిమ అమెరికా..

Updated : 30 Jun 2021 10:56 IST

 ఠారెత్తిస్తున్న ఎండలు .. 

వాషింగ్టన్‌: ఏసీలు సరిపోవటం లేదు... రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోయాయి... మున్సిపాలిటీ సరఫరా చేసే మంచినీరు తగ్గించేశారు... అమెరికాలో తాజా దృశ్యాలివి! వేసవికాలం ఆరంభంలోనే అమెరికాను ముఖ్యంగా పశ్చిమ అమెరికా రాష్ట్రాలను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో పశ్చిమ ప్రాంతాల్లో సుమారు 4 కోట్ల మంది ప్రజల్ని అమెరికా వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. అనవసరంగా బయటకు రాకూడదంటూ హెచ్చరికలు జారీ చేసింది. 

దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో గతంలో కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇదో అనూహ్య పరిస్థితిగా పేర్కొంది. అంతేగాకుండా ఈసారి వేసవిలో అన్ని రికార్డులూ బద్దలయ్యేలా ఉన్నాయని అంచనా వేస్తోంది. సోమవారం ఫీనిక్స్‌లో 46 డిగ్రీల సెల్సియస్, సియాటిల్‌లాంటి చోట్ల 44 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం పోర్ట్‌లాండ్‌లో 44.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. 1940 నుంచి ఇప్పటిదాకా ఇదే అత్యధిక రికార్డుగా చెబుతున్నారు. సియాటిల్‌లో గత వారాంతం ఉష్ణోగ్రతలు 1894 నాటి రికార్డులను బద్దలుగొట్టాయని చెబుతున్నారు. అన్ని పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రతిచోటా పాత రికార్డులు బద్దలవుతున్నాయి. కాలిఫోర్నియా పాల్‌స్ప్రింగ్స్‌లో 47 డిగ్రీల సెల్సియస్‌పైగా నమోదైంది. 

కొవిడ్‌ నియంత్రణల సడలింపు 

తాజా ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని వాషింగ్టన్‌లో కొవిడ్‌ నియంత్రణలను కూడా సడలించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కూలింగ్‌ సెంటర్లలో ప్రజల్ని పూర్తిగా అనుమతించాలని నిర్ణయించారు. ఏసీ థియేటర్లు, షాపింగ్‌ మాల్‌లలో పూర్తిగా ప్రజల్ని అనుమతించనున్నారు. అలాగే స్విమ్మింగ్‌ పూల్‌లలో కూడా! టెక్సాస్, కాలిఫోర్నియాల్లో... విద్యుత్‌ గ్రిడ్‌ ఆపరేటర్లను అప్రమత్తం చేశారు. ఎండల కారణంగా విద్యుత్‌ వినియోగం అనూహ్యంగా పెరుగుతుండటంతో గ్రిడ్‌కు సమస్యలు తలెత్తవచ్చని భావిస్తున్నారు. అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాలిఫోర్నియాలోని కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాను తగ్గిస్తున్నారు. కెనడాలో కూడా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం బ్రిటిష్‌ కొలంబియాలో ఉష్ణోగ్రత 46.6 డిగ్రీల సెల్సియస్‌! 

హీట్‌డోమ్‌ కారణం 

పసిఫిక్‌ మహా సముద్రంలో ఉష్ణోగ్రతల్లో తేడా వల్ల ఏర్పడే హీట్‌డోమ్‌ కారణంగా ఉష్ణోగ్రతలింతగా నమోదవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ‘‘పర్యావరణ మార్పుల కారణంగానే ఇవన్నీ సంభవిస్తున్నాయి. ఇలా ఉష్ణోగ్రతలు పెరగటం ఇకమీదట మామూలవుతుంది. దీనికి అంతా అలవాటు పడాల్సిందే’’ అని కాలిఫోర్నియా యూనివర్సిటీలో వాతావరణ నిపుణుడు డేనియల్‌ స్వెయిన్‌ వ్యాఖ్యానించారు. వచ్చే మూడు నెలల పాటు ఉష్ణోగ్రతలు భారీగానే నమోదవుతాయని అమెరికా వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని