Corona: జీవనశైలి రోగులపై కొవిడ్‌ పంజా

అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండెజబ్బు, పక్షవాతం..

Updated : 22 Jul 2021 09:16 IST

ఊబకాయుల్లో ముప్పు ఏడింతలు అధికం
మధుమేహుల్లో మూడింతలు, అధిక రక్తపోటు బాధితుల్లో 2.3 రెట్లు ఎక్కువ
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో అప్రమత్తత అవసరం
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా అధ్యయనం

అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండెజబ్బు, పక్షవాతం.. ఇలా అన్ని రకాల జీవనశైలి వ్యాధిగ్రస్తులపై కొవిడ్‌ పంజా విసురుతోంది. సాధారణ కొవిడ్‌ రోగుల కంటే దీర్ఘకాలికంగా ఈ వ్యాధులతో బాధపడుతున్న వారికి గనుక కొవిడ్‌ సోకితే.. ముప్పు తీవ్రత అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.  మధుమేహుల్లో మూడింతలు, అధిక రక్తపోటు బాధితుల్లో 2.3 రెట్లు అధికంగా అనారోగ్య తీవ్రత ఉంటోందని తేల్చిచెప్పింది. ‘కొవిడ్‌-జీవనశైలి వ్యాధులు’ కోణంలో ఇప్పటికే పలు దేశాల్లో వందలాది పరిశోధనలు జరగ్గా.. వేర్వేరు ప్రఖ్యాత వైద్యపత్రికల్లో ప్రచురితమైన వాటన్నింటినీ క్రోడీకరించి తాజాగా అధ్యయనాన్ని విడుదల చేసింది. జీవనశైలి వ్యాధిగ్రస్తులకే కొవిడ్‌ ఎక్కువ సోకుతుందనడానికి స్పష్టమైన ఆధారాలేమీ లేకపోయినా.. వారు వైరస్‌ బారినపడితే మాత్రం కొందరిలో వ్యాధి తీవ్రరూపం దాలుస్తోందని తెలిపింది. ఐసీయూలో చికిత్స పొందాల్సి వస్తోందనీ, కొందరు ప్రాణాలను కూడా కోల్పోవాల్సి వస్తోందని అధ్యయనం వివరించింది. ఆర్‌టీ పీసీఆర్‌ టెస్టులో పాజిటివ్‌గా నిర్ధారణ అయిన జీవనశైలి వ్యాధిగ్రస్తుల్లో ఈ పరిశోధన కొనసాగింది. ధూమపానం, మద్యపానం, శారీరక శ్రమ చేయకపోవడం, కాలుష్యం కారణంగానూ ముప్పు పెరుగుతోందని వివరించింది. 

టీకా పొందినా జాగ్రత్తలు తప్పవు

టీకా వేసుకున్న తర్వాత కూడా దీర్ఘకాలిక జబ్బులున్న వారు జాగ్రత్తగా ఉండాల్సిందే. కొందరిలో రెండు డోసుల టీకా పొందినా కూడా యాంటీబాడీలు వృద్ధి చెందలేదని చెబుతుంటారు. అలాంటి వారిలో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారు ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి టీకా పొందిన తర్వాత కూడా ముప్పు తొలగిపోయినట్లు భావించొద్దు. ఎప్పటిలాగే మాస్కు ధరించాలి. గుంపుల్లోకి వెళ్లకపోవడమే మంచిది. ఏ వస్తువును ముట్టుకున్నా వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఏ మాత్రం అనుమానిత కొవిడ్‌ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.-డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ ఇన్‌ఛార్జి, 

నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రి

ఊబకాయం గాడితప్పిన ఆహారపు అలవాట్లు, మరుగునపడిన వ్యాయామం కారణంగా ముందుగా ఎదురయ్యేది అధిక బరువే.  నియంత్రణలోకి తెచ్చుకోకుంటే.. బరువు పెరిగి ఊబకాయం స్థితికి చేరుకుంటారు. ఒక్క ఊబకాయం బారినపడితే.. అనేక రకాల జబ్బులకు ఆహ్వానం పలికినట్లే. సాధారణ కొవిడ్‌ రోగులతో పోల్చితే.. కరోనా వైరస్‌ బారినపడిన ఊబకాయుల్లో ఏడింతలు అధికంగా ముప్పు తీవ్రత పొంచి ఉంది. అందుకే ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించాలి. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో పౌష్టికాహారం పాత్ర కీలకమైందని గుర్తించాలి.

మధుమేహం 

ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ మధుమేహం వేధిస్తున్నా.. భారత్‌ను మాత్రం పట్టి పీడిస్తోంది. మధుమేహుల్లో రోగ నిరోధక శక్తి పోతుంది. నియంత్రణలో పెట్టుకోకపోతే అన్ని అవయవాలపైనా దుష్ప్రభావం చూపుతుంది. అందులోనూ కొవిడ్‌ సమయంలో సాధారణ రోగుల్లో కంటే మధుమేహుల్లో వైరస్‌ మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇతర కరోనా బాధితులతో పోల్చితే వీరిలో ముప్పు తీవ్రత మూడింతలు అధికమని అధ్యయనం స్పష్టం చేస్తోంది. మధుమేహుల్లో కొవిడ్‌ తీవ్రమవడమే కాకుండా ప్రాణాపాయ స్థితికి చేరుకునే అవకాశాలూ ఎక్కువే. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణ లేని వారిలో కొవిడ్‌ సోకితే ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారే అవకాశాలు అధికమని చెబుతోంది. అందుకే ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ఒక మార్గమైతే.. మధుమేహం బారినపడినా రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుకోవడం అన్నింటికంటే ముఖ్యం.

అధిక రక్తపోటు

మధుమేహం తర్వాత ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య అధిక రక్తపోటు. ఇది కూడా నిశ్శబ్దంగా చుట్టుముడుతుంది. ఇప్పటి వరకూ అనేక దీర్ఘకాలిక జబ్బులపై పరిశోధనలు వచ్చినా. హైబీపీపై చాలా తక్కువ సంఖ్యలో వచ్చాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. హైబీపీ బాధితులకు కొవిడ్‌ సోకితే వీరిలో ముప్పు 2.3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదే గుండెజబ్బు ఉన్నవారు కరోనా వైరస్‌ బారినపడితే 2.9 రెట్లు, పక్షవాతం ఉన్నవారు మహమ్మారి కోరల్లో చిక్కుకుంటే 3.9 రెట్లు ముప్పు తీవ్రత అధికంగా ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్న కొవిడ్‌ బాధితుల్లో మరణాల శాతం 3.5 రెట్లు ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనం పేర్కొంది.

శ్వాసకోశ వ్యాధులు

కరోనాలో ప్రధానంగా దుష్ప్రభావం అధికంగా పడేది శ్వాసకోశాలపైనే. వైరస్‌ శ్వాసకోశాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. అయితే ఇప్పటికే ఆస్తమా సహా ఇతర దీర్ఘకాలిక శ్వాసకోశ జబ్బులతో బాధపడుతున్నవారికి కొవిడ్‌ సోకితే ముప్పు తీవ్రత అధికంగా ఉంటుంది. వీరిలో మరణాల సంఖ్య కూడా అధికమేనని అధ్యయనం చెబుతోంది.
క్యాన్సర్‌
క్యాన్సర్‌ రోగుల్లోనూ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీరు త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారినపడడానికి అవకాశాలుంటాయి. వేర్వేరు రకాల క్యాన్సర్లతో బాధపడుతున్న వారికి కరోనా వైరస్‌ సోకితే.. ఎక్కువమంది ఆసుపత్రిలో చేరి, ఐసీయూలో చికిత్స పొందాల్సిన అవసరం పడుతోంది. వీరిలో ప్రాణాలు కోల్పోయే వారు కూడా గుర్తించగలిగిన సంఖ్యలోనే ఉంటున్నారు. ముఖ్యంగా రక్త క్యాన్సర్‌ బాధితుల్లో కొవిడ్‌ ముప్పు తీవ్రత చాలా అధికం.

ధూమపానం

జీవనశైలి వ్యాధుల్లో ధూమపానం కారణంగా వచ్చేవి అధికం. ఒక్క ధూమపానాన్ని మానేస్తే అధిక రక్తపోటు, గుండెజబ్బులు మొదలుకొని ప్రాణాంతక క్యాన్సర్‌ వరకూ అనేక జబ్బులనూ దూరం చేసుకోవచ్చు. సాధారణ కరోనా బాధితుల కంటే ధూమపానం చేసే వారిలో గనుక కొవిడ్‌ సోకితే 1.5 రెట్లు ఎక్కువగా ముప్పు తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి. వీరిలో మరణాల శాతం కూడా ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు. ఏ రూపంలోనైనా పొగాకు ఉత్పత్తులను తీసుకోవడం ఆరోగ్యానికి చేటు అనేది గ్రహించాలి.

మద్యపానం

మోతాదుకు మించి మద్యపానం తీసుకునేవారిలో కాలేయ వ్యాధులతో పాటు ఇతర అనారోగ్య సమస్యలూ చుట్టుముడతాయి. రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. ఎప్పుడూ తాగకుండా కేవలం ఒక్కరోజు మోతాదుకు మించి మద్యపానాన్ని స్వీకరించినా వారిలోనూ గణనీయంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కొవిడ్‌ సోకితే వారిలో తీవ్ర ప్రభావం చూపుతుంది. వీరిలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సమర్థత తగ్గిపోతుంది. ఇటువంటి వారు మహమ్మారి బారినపడితే ఎక్కువ రోజులు ఆసుపత్రిలో చేరి ఐసీయూలో చికిత్స పొందాల్సి వస్తుంది.

శారీరక శ్రమ లేకపోవడం

ఏదో రూపంలో శారీరక శ్రమను పెంచుకోవడం వల్ల తాత్కాలిక, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అధ్యయనం స్పష్టం చేసింది. క్రమం తప్పని వ్యాయామం రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గడానికి ఇది దోహదపడుతుంది. అంతేకాదు.. గుండెజబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, అధిక బరువు వంటివి రాకుండా కూడా శారీరక శ్రమ తోడ్పడుతుంది. శారీరక శ్రమకు దూరమైతే.. ఈ తరహా దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధుల బారిన పడే ప్రమాదమూ ఉంది.క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేస్తున్న వారికి కొవిడ్‌ వచ్చినా కూడా ముప్పు తీవ్రమవకుండా అడ్డుకుంటుంది. 

కాలుష్యం

కాలుష్యం అనేక దుష్పరిణామాలకు దారితీస్తుంది. అందులోనూ వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాధితులకు తెలియకుండానే ఇప్పటికే ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుందని అధ్యయనం చెబుతోంది. శ్వాసకోశాల పనితీరును దెబ్బతిస్తుంది. తద్వారా శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల బారినపడడానికి అవకాశాలెక్కువవుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొవిడ్‌ సోకితే మరింత ప్రమాదకరంగా మారుతుంది. ప్రాణాపాయ ముప్పు కూడా వీరిలో ఎక్కువే. అందుకే వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవడం, పర్యావరణ పరిరక్షణకు పాటుపడటం వంటివి కూడా కొవిడ్‌ ముప్పు తీవ్రత నుంచి కాపాడుకోవడానికి దోహదపడతాయి.- ఈనాడు, హైదరాబాద్‌ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని