China: సరిహద్దు ఒప్పందాలకు కొత్త చట్టం విఘాతం కాదు

కొత్తగా తాము తెచ్చిన సరిహద్దు చట్టం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చైనా స్పష్టం చేసింది. ఇతర దేశాలతో

Published : 29 Oct 2021 09:30 IST

ఊహాగానాలు తగవంటూ చైనా వివరణ

బీజింగ్‌: కొత్తగా తాము తెచ్చిన సరిహద్దు చట్టం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చైనా స్పష్టం చేసింది. ఇతర దేశాలతో ఇప్పటికే కుదిరిన సరిహద్దు ఒప్పందాల అమలుకు అది అవరోధం కాబోదని గురువారం తెలిపింది. దీనిపై ఆయా దేశాలు ‘ఉద్దేశపూర్వక ఊహాగానాలు’ చేయడం తగదని పేర్కొంది.  

సరిహద్దుల రక్షణతో పాటు అక్కడి ప్రాంతాలను సద్వినియోగం చేసుకోవడానికి ఈ నెల 23న చైనా పార్లమెంటు ‘నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌’ (ఎన్‌పీసీ) ఒక చట్టాన్ని ఆమోదించింది. తూర్పు లద్దాఖ్‌లో దీర్ఘకాలంగా సైనిక ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో డ్రాగన్‌ చేపట్టిన ఈ చర్యపై భారత్‌ బుధవారం తీవ్రంగా స్పందించింది. చట్టాన్ని సాకుగా చూపిస్తూ సరిహద్దుల్లో పరిస్థితిని ఏకపక్షంగా మార్చే చర్యలను చైనా చేపట్టబోదని ఆశిస్తున్నట్లు స్పష్టంచేసింది. ప్రస్తుతమున్న ద్వైపాక్షిక ఒప్పందాలపై దీని ప్రభావం పడుతుందేమోనని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ అంశంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ స్పందించారు. ‘‘ఇది సాధారణ, అంతర్గత చట్టం. అది మా వాస్తవిక అవసరాలను నెరవేరుస్తుంది. అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగానే అది ఉంది’’ అని పేర్కొన్నారు. పొరుగు దేశాలతో సహకారం అంశాన్ని కూడా ఆ చట్టంలో స్పష్టంగా పొందుపరిచామన్నారు. ప్రస్తుతమున్న సరిహద్దు ఒప్పందాల అమలుకు అది విఘాతం కాదంటూ.. పరోక్షంగా భారత్‌ లేవనెత్తిన ఆందోళనలను ప్రస్తావించారు. పొరుగు దేశాలతో సహకారం విషయంలో తమ వైఖరి మారబోదన్నారు. కొత్త చట్టంపై అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సంతకం చేశారని, అది వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని వాంగ్‌ చెప్పారు. ‘‘జాతీయ భూ సరిహద్దు చట్టాన్ని తీసుకురావడం వెనుక మాకున్న ఉద్దేశాల గురించి ఇప్పుడు వివరించా. దీనిపై సంబంధిత దేశాలు అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడతాయని, ఈ చట్టంపై ఉద్దేశపూర్వక ఊహాగానాలకు స్వస్తి పలుకుతాయని ఆశిస్తున్నా’’ అని చెప్పారు.

మాపై పెరిగిన అమెరికా నిఘా

అమెరికా తమపై నిఘాను బాగా పెంచిందని చైనా సైనిక పరిశోధన విభాగం అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది అమెరికాకు చెందిన యుద్ధనౌకలు, విమానాలు 2వేలు సార్లు చాలా దగ్గరగా నిఘా వేసేందుకు వచ్చాయని చెప్పారు. ఇలాంటివి తమ దేశ సార్వభౌమాధికారాన్ని ప్రమాదంలో పడేస్తాయని తెలిపారు. కాల్పుల ముప్పును కూడా పెంచుతాయని హెచ్చరించారు. చైనా సైన్యం (పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ-పీఎల్‌ఏ)లో అకాడమీ ఆఫ్‌ మిలటరీ సైన్స్‌లో పరిశోధకుడిగా ఉన్న కావో యాంజాంగ్‌ తాజాగా ఒక వార్షిక సైనిక సదస్సులో ఈ విషయాలు తెలిపారు. అమెరికా ప్రధానంగా దక్షిణ చైనా సముద్రంపై నిఘా పెడుతున్నట్లు చెప్పారు. అక్కడ తమ అధీనంలో ఉన్న దీవులపై కన్నేసి ఉంచుతోందని  వివరించారు. ‘‘తరచూ ఇంత దగ్గరగా వచ్చి నిఘా పెట్టడం వల్ల ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతాయి. ఇలాంటి చర్యలకు  అనివార్యంగా చైనా నుంచి ప్రతిస్పందన తప్పదు. అవి కాల్పుల ముప్పును పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. వాణిజ్యం, సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాల్లో తమను నిలువరించడానికి కూడా అమెరికా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలకు అమెరికా తక్షణం స్వస్తి పలకాలని కోరారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా క్షీణించిన సంగతి తెలిసిందే. వాణిజ్యం, దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ దురుసు చర్యలు, హాంకాంగ్‌లో మానవహక్కుల ఉల్లంఘన వంటి అంశాలపై పరస్పరం విమర్శనాస్త్రాలను సంధించుకుంటున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని