Pegasus: ప్రభుత్వాలకు ఎగుమతికే ఇజ్రాయెల్‌ లైసెన్సు

నిఘా కోసం ఉద్దేశించిన పరికరాలను ప్రభుత్వాలకు ఎగుమతి చేయడానికే ఇజ్రాయెల్‌ ప్రభుత్వం లైసెన్సులు మంజూరు చేస్తుందని 

Updated : 29 Oct 2021 11:57 IST

పెగాసస్‌ స్పైవేర్‌ భారత్‌ అంతర్గత విషయం 
నూతన రాయబారి గిలన్‌ స్పష్టీకరణ 

దిల్లీ: నిఘా కోసం ఉద్దేశించిన పరికరాలను ప్రభుత్వాలకు ఎగుమతి చేయడానికే ఇజ్రాయెల్‌ ప్రభుత్వం లైసెన్సులు మంజూరు చేస్తుందని భారత్‌లో ఆ దేశ నూతన రాయబారి నయర్‌ గిలన్‌ స్పష్టం చేశారు. గురువారం ఆయన దిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెగాసస్‌ స్పైవేర్‌ వంటివి సమకూర్చే ఎన్‌ఎస్‌వో వంటి కంపెనీలు నేరుగా ప్రభుత్వేతర సంస్థలకు ఉత్పత్తుల్ని విక్రయించేందుకు తమ ప్రభుత్వం అనుమతించబోదని తేల్చిచెప్పారు. వివాదం రేకెత్తించిన ఆరోపణలపై తాను స్పందించబోననీ, ఇది పూర్తిగా భారతదేశ అంతర్గత విషయమని పేర్కొన్నారు. ‘ఎన్‌ఎస్‌వో ఒక ప్రైవేటు కంపెనీ. అలాంటి కంపెనీలు చేసే ప్రతి ఎగుమతికీ ఇజ్రాయెల్‌ ప్రభుత్వ లైసెన్సు తప్పనిసరి. ప్రధానంగా మేం చూసేది ఆ ఎగుమతి.. ప్రభుత్వ సంస్థకేనా కాదా అనేదే’ అని తేల్చిచెప్పారు. భారత్‌తో ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వచ్చే జూన్‌ నాటికి కొలిక్కి రావచ్చన్నారు. 

సుప్రీంకోర్టు ఆదేశాలు ఇంకా అందలేదు: జస్టిస్‌ రవీంద్రన్‌ 

బెంగళూరు: ప్రముఖుల ఫోన్లపై నిఘా కోసం పెగాసస్‌ స్పైవేర్‌ను అక్రమంగా వాడారా లేదా అనేది తేల్చడానికి నియమించిన కమిటీ దర్యాప్తు పరిశీలనకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు తనకు ఇంకా అందలేదని సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.వి.రవీంద్రన్‌ తెలిపారు. దర్యాప్తు పరిధి గురించి ‘పీటీఐ’ వార్తాసంస్థ ఆయన స్పందనను కోరినప్పుడు ఈ మేరకు సమాధానమిచ్చారు. ఉత్తర్వులు తనకు అందితే గానీ ఏమీ చెప్పలేనన్నారు. 

విచారణ కమిటీలో ఉండబోమనడం వ్యాకులత కలిగించింది: చిదంబరం 

దిల్లీ: ప్రముఖుల ఫోన్లపై నిఘా విధించారో లేదో పరిశీలన జరిపేందుకు ఉద్దేశించిన కమిటీలో ఉండబోమని అనేకమంది సున్నితంగా నిరాకరించడం వ్యాకులత కలిగించిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చెప్పారు. పాలకులను చూసి భారతీయులు భయపడిపోకూడదన్న మహాత్మా గాంధీ ప్రబోధం నుంచి మన దేశం ఎక్కడ వరకు వచ్చిందో ఈ ఉదంతమే చాటుతోందన్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని