Zinc Supplements: జింక్‌ సప్లిమెంట్లతో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌ కట్టడి

శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల కారణంగా తలెత్తే దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలను జింక్‌ సప్లిమెంట్లు తగ్గించగలవని 

Published : 04 Nov 2021 11:37 IST

గుర్తించిన ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు

మెల్‌బోర్న్‌: శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల కారణంగా తలెత్తే దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలను జింక్‌ సప్లిమెంట్లు తగ్గించగలవని తాజా పరిశోధనలో వెల్లడైంది. అయితే, వివిధ జింక్‌ సమ్మేళనాలను ఏయే మోతాదుల్లో తీసుకోవాలన్న విషయాన్ని మాత్రం శాస్త్రవేత్తలు ఇంకా నిర్ధారించలేదు. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల కారణంగా దగ్గు, జలుబు, ఫ్లూ, సైనసైటిస్, నిమోనియా, కొవిడ్‌ కారక ఇబ్బందులు తలెత్తుతాయి. దీనిపై వెస్టర్న్‌ సిడ్నీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. రోగ నిరోధకశక్తి, అంతర్గత వాపులు, కణజాల గాయాలు, రక్తపోటు, ఆక్సిజన్‌ లేమి కారణంగా తలెత్తే కణజాల ప్రతిస్పందనలపై ‘జింక్‌’ ప్రభావం చూపుతున్నట్టు గుర్తించారు. శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లను తగ్గించే ఔషధాల మాదిరే ఇది కూడా ఉపశమనం కలిగించగలదని నిర్ధారించారు. పరిశోధనలో భాగంగా... కొందరు బాధితులకు జింక్‌ సప్లిమెంట్లు, మరికొందరికి ప్లాసిబో ఔషధాలను ఇచ్చారు. జింక్‌ తీసుకున్నవారిలో ఇన్‌ఫెక్షన్‌ లక్షణాల తీవ్రత మూడోరోజు తగ్గడం ప్రారంభించింది. మిగతావారి కంటే సుమారు వారం రోజుల ముందే లక్షణాలు పూర్తిగా తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. ‘‘వ్యాధిబారిన పడిన తర్వాత త్వరగా కోలుకోవాలని భావించేవారికి, అనవసరంగా యాంటీ-బయోటిక్‌ ఔషధాలను వాడే అలవాటు ఉన్నవారికి జింక్‌ ఒక మంచి ప్రత్యామ్నాయం కాగలదు’’ అని వారు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని