ISRO: చంద్రయాన్‌-2కు అతిదగ్గరగా అమెరికా ఆర్బిటర్‌

చంద్రుడి ఉత్తర ధ్రువానికి సమీపంలో భారత్‌కు చెందిన చంద్రయాన్‌-2 వ్యోమనౌక, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసాకు చెందిన

Published : 18 Nov 2021 12:35 IST

ప్రమాదాన్ని తప్పించామన్న ఇస్రో 

బెంగళూరు: చంద్రుడి ఉత్తర ధ్రువానికి సమీపంలో భారత్‌కు చెందిన చంద్రయాన్‌-2 వ్యోమనౌక, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసాకు చెందిన ‘లూనార్‌ రికానసన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్‌వో)’ పరస్పరం ఢీకొట్టుకునే ప్రమాదం త్రుటిలో తప్పింది! కీలకమైన ‘కొలిజన్‌ అవాయిడెన్స్‌ మెనూవర్‌ (క్యామ్‌)’ విన్యాసాన్ని విజయవంతంగా చేపట్టడం ద్వారా ఆ ప్రమాదాన్ని తప్పించినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇస్రో కథనం ప్రకారం.. చంద్రయాన్‌-2 వ్యోమనౌక, ఎల్‌ఆర్‌వో రెండూ జాబిల్లి ఉత్తర ధ్రువానికి సమీపంలో ఈ ఏడాది అక్టోబరు 20న ప్రమాదకర రీతిలో పరస్పరం సమీపంలోకి రానున్నట్లు శాస్త్రవేత్తలు ముందే గుర్తించారు. ఓ దశలో వాటి మధ్య రేడియల్‌ వేర్పాటు దూరం 100 మీటర్ల కంటే తక్కువకు చేరుకుంటుందని అంచనా వేశారు. అవి పరస్పరం ఢీ కొట్టుకోకుండా ఉండేందుకు క్యామ్‌ విన్యాసం చేపట్టాలని ఇస్రో, నాసా నిర్ణయించాయి. పరస్పర అంగీకారం మేరకు అక్టోబరు 18న చంద్రయాన్‌-2కు ఈ విన్యాసాన్ని నిర్వహించారు. దీంతో అవి ఢీకొట్టుకునే ముప్పు తొలగిపోయింది. అంతరిక్షంలోని వస్తువులు, వ్యర్థాలతో ఢీ కొట్టే ముప్పును తొలగించేందుకుగాను భూ కక్ష్యలోని ఉపగ్రహాలకు క్యామ్‌ విన్యాసం చేపట్టడం సర్వసాధారణమని ఇస్రో తెలిపింది. తాము ప్రయోగించిన వ్యోమనౌకకు ఇలాంటి పరిస్థితి ఎదురవడం మాత్రం ఇదే తొలిసారి అని పేర్కొంది. భవిష్యత్తులో పరస్పరం సమీపంలోకి వచ్చే క్రమంలోనూ చంద్రయాన్‌-2, ఎల్‌ఆర్‌వో మధ్య తగినంత రేడియల్‌ వేర్పాటు దూరం ఉండేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని