Published : 21/11/2021 10:09 IST

Covid: కరోనా మందులపై ముందుచూపు లేదు

కొవిడ్‌ ఔషధాల గుర్తింపులో కొరవడిన వ్యూహం 
ఇది గుణపాఠం కావాలి : శాస్త్రవేత్తలు 

అడిలైడ్‌: కొవిడ్‌-19 చికిత్స కోసం అనేక ఔషధాలు అందుబాటులోకి వస్తున్నాయి. వచ్చే ఏడాది మరికొన్ని రాబోతున్నాయి. అందులో కొన్నింటిని రోగులు ఇళ్లలోనే తీసుకోవచ్చు. మిగతావాటిని ఆసుపత్రుల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. మహమ్మారి ప్రజ్వరిల్లిన రెండేళ్ల తర్వాత ఈ స్థితికి చేరుకోగలిగాం. అయితే ఈ విషయంలో చాలా ఆలస్యం జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఔషధ ప్రయోగాల్లో విస్తృత భాగస్వామ్యాలు, ఇతర రుగ్మతల కోసం ప్రస్తుతం వాడుకలో ఉన్న మందుల్లో కొవిడ్‌పై ఫలితాన్ని ఇచ్చే వాటిని గుర్తించడం వంటివి సమర్థంగా చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. దానివల్ల చాలా ముందుగానే కరోనాకు పెద్ద సంఖ్యలో సమర్థ మందులు వచ్చేవన్నారు. దీనిపై ఆస్ట్రేలియాలోని న్యూకాజిల్‌కు చెందిన జెన్నిఫర్‌ మార్టిన్, దక్షిణ ఆస్ట్రేలియా వర్సిటీకి పరిశోధకుడు రిచర్డ్‌ జాన్‌ హెడ్‌లు ఒక పరిశోధన పత్రం వెలువరించారు. వీరి విశ్లేషణ ప్రకారం.. 

మానసిక కుంగుబాటుకు ఉపయోగించే ఫ్లువోక్సామైన్‌ ఔషధం కొవిడ్‌ బాధితులపై పనిచేస్తుందని ఇటీవలి అధ్యయనంలో తేలింది. ప్రస్తుత ఔషధాల్లో కొవిడ్‌పై పనిచేసే వీలున్న ఇలాంటివాటిని గుర్తించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని ఎంత డోసులో తీసుకోవాలన్నదానిపైనా ఇప్పటికే నిపుణులకు ఒక అవగాహన ఉంటుంది. అలాగే దుష్ప్రభావాలపైనా పూర్తిస్థాయి సమాచారం ఉంటుంది. కుంగుబాటు కోసం ఈ ఔషధాన్ని తీసుకుంటున్నవారు కొవిడ్‌ను బాగా ఎదుర్కొన్నారని వెల్లడైంది. దీని ఆధారంగానే ఈ మందును తదుపరి పరీక్షల కోసం ఎంచుకున్నారు. భారీ స్థాయిలో జనాభాపై పరీక్షించారు. దీనివల్ల అర్థవంతమైన ఫలితాలు వచ్చాయి. 

తొలినాళ్లలోనే అవకాశాన్ని కోల్పోయాం

కొవిడ్‌ను రెండు రకాల వ్యూహాలతో చికిత్స చేయవచ్చు. ఒకటి.. వైరస్‌ను లక్ష్యంగా చేసుకోవడం లేదా వైరస్‌ను నిర్వీర్యం చేయడం. రెండోది.. రోగికి చికిత్స చేయడం. ఈ విధానంలో.. వైరస్‌కు స్పందనగా శరీరంలో వెలువడే తీవ్రస్థాయి పరిణామాలకు చికిత్స చేస్తారు. ఫ్లువోక్సామైన్‌ కూడా ఈ కోవలోకే చెందుతుంది. అయితే మహమ్మారి ఆరంభంలో దీనిపై పెద్దగా దృష్టిసారించలేదు. దశాబ్దాల నాటి డెక్సామిథాసోన్, బుడెసోనైడ్‌ వంటి కార్టికోస్టెరాయిడ్‌లతో చికిత్స మినహా పెద్దగా చేసిందేమీ లేదు. మొదట్లోనే దీనిపై దృష్టిపెట్టి ఉంటే టీకాలు, యాంటీవైరల్‌ ఔషధాల అభివృద్ధికి మరింత సమయం లభించేది.

పెద్ద సంఖ్యలో చిన్న ప్రయోగాలు

మహమ్మారి సమయంలో కొవిడ్‌ ఔషధాల కోసం 2800 క్లినికల్‌ ప్రయోగాలు జరిగాయి. అనేక ప్రయోగాల్లో వంద కన్నా తక్కువ మందినే వాలంటీర్లుగా ఎంచుకున్నారు. ఇలాంటివాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక ఔషధం సురక్షితంగా, సమర్థంగా పనిచేస్తుందా అన్నది తెలియాలంటే భాగస్వామ్యంతో కూడిన భారీ క్లినికల్‌ ట్రయల్స్‌ జరగాలి. ఉదాహరణకు.. ‘రికవరీ’ అనే ప్రయోగంలో 180 ప్రదేశాల్లో 45వేల మందిని చేర్చుకున్నారు. ఇందులో డెక్సామెథాసోన్‌ వల్ల మరణాలు తగ్గుతాయని వెల్లడైంది. ఫలితంగా ప్రామాణిక చికిత్స విధానంలో మార్పు వచ్చింది.

భవిష్యత్తులో ఎలా..?

ప్రస్తుత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. భవిష్యత్తులో మహమ్మారులు ఉత్పన్నమైనప్పుడు ఆరంభ దశలోనే ఔషధాలను అభివృద్ధి చేసే మార్గాలను గుర్తించాలి. అంతర్జాతీయ భాగస్వామ్యాలతో భారీ స్థాయి క్లినికల్‌ ప్రయోగాల ప్రాముఖ్యతను గుర్తించాలి. అలాగే జాతీయంగానూ పరిశోధన ప్రయోగాలను సమన్వయం చేసుకోవాలి.

తప్పుడు నిర్ణయాలు

ప్రస్తుతమున్న అనేక ఔషధాలతో సాంక్రమిక వ్యాధులకు ఏళ్లుగా చికిత్స చేస్తున్నారు. ఈ అనుభవం ఆధారంగా.. ప్రస్తుత ఔషధాల్లో కొన్ని కొవిడ్‌కు పనికిరావని అవగాహన ఉన్నప్పటికీ వాటిపై ప్రయోగాలు చేశారు. స్పానిష్‌ ఫ్లూను క్వినైన్, దానికి సంబంధించిన ఔషధాలతో చికిత్స చేసేందుకు గతంలో విఫలయత్నం చేశారు. అయినా దానితో ముడిపడిన హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందుతో కొవిడ్‌కు చికిత్స కోసం భారీగా ప్రయోగాలు చేయడం గమనార్హం. ఇలాంటి ప్రాథమిక విధానాలను అనుసరించి ఉంటే.. ఐవర్‌మెక్టిన్, హైడ్రాక్సిక్లోరోక్విన్‌లు కరోనాపై పనిచేయవని మొదటే అర్థమై ఉండేది.  

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని