Lockdown: ‘లాక్‌డౌన్‌’.. డౌన్‌ డౌన్‌.. కొవిడ్‌ నిబంధనలపై వివిధ దేశాల్లో నిరసనలు

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఓవైపు కొవిడ్‌ విజృంభిస్తుండగా.. మరోవైపు అక్కడి ప్రభుత్వాలు విధిస్తున్న లాక్‌డౌన్‌ వంటి నిబంధనలను

Published : 22 Nov 2021 01:29 IST

నెదర్లాండ్స్‌లో కాల్పులు.. ఏడుగురికి గాయాలు 

వియన్నా: ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఓవైపు కొవిడ్‌ విజృంభిస్తుండగా.. మరోవైపు అక్కడి ప్రభుత్వాలు విధిస్తున్న లాక్‌డౌన్‌ వంటి నిబంధనలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా ఐరోపా దేశాల్లో ఇలాంటి నిరసనలు పెరుగుతున్నాయి. కొవిడ్‌ నాలుగో ఉద్ధృతి తీవ్రంగా ఉన్న ఆస్ట్రియాలో సోమవారం నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనిపై పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దాదాపు 35 వేల మంది రాజధాని నగరమైన వియన్నాలో శనివారం ప్రదర్శనలు చేపట్టారు. దీంతో 1,300 మంది పోలీసు అధికారులు బందోబస్తు చేపట్టారు. నిరసనకు దిగిన చాలామంది మాస్కులు కూడా ధరించలేదు. లాక్‌డౌన్‌ వంటి నిబంధనలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారంతా అంటున్నారు. అలాగే స్విట్జర్లాండ్, క్రొయేషియా, ఇటలీల్లోనూ కొవిడ్‌ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. 

* నెదర్లాండ్స్‌లో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. రోటర్‌డ్యామ్‌ నగరంలో శుక్రవారం రాత్రి పెద్దఎత్తున ప్రజలు నిరసనకు దిగడంతో డచ్‌ పోలీసులు వారిని అదుపు చేసేందుకు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ఏడుగురు గాయపడ్డారు. బ్రెడా నగరంలోనూ వందల సంఖ్యలో ప్రజలు నిరసన చేపట్టారు. 

* పలు ఐరోపా దేశాల్లో టీకాలు తీసుకున్నవారికి కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ.. తీసుకోనివారికి నిబంధనలు అమలు చేయడంతో ఓ రకమైన సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్‌ తీసుకోనివారిని కొన్ని దుకాణాలు, మాల్స్‌లోకి అనుమతించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. స్లోవేకియాలో వ్యాక్సిన్‌

తీసుకోని వారికి పలు దుకాణాలు, మాల్స్‌లోకి ప్రవేశాన్ని నిషేధించారు. వీరు ఎలాంటి బహిరంగ కార్యక్రమాల్లోనూ పాల్గొనడానికి అనుమతి లేదు. అలాగే పనుల్లోకి వెళ్లాలంటే వారంలో రెండు సార్లు పరీక్షలు చేయించుకోవాలన్న నిబంధనలు విధించారు. గ్రీస్‌లోనూ టీకా తీసుకోనివారికి పలు నిబంధనలు అమలవుతున్నాయి.

ఆస్ట్రేలియాలో కొత్త చట్టంపై నిరసనలు..

కరోనా కట్టడికి ఆస్ట్రేలియాలో ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజారోగ్య నిర్వహణలో ఆరోగ్య మంత్రికి విస్తృత అధికారాలను కట్టబెట్టడం, ఓ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించే అధికారం ప్రధానమంత్రికి ఇవ్వడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. దీన్ని వ్యతిరేకిస్తూ మెల్‌బోర్న్‌ నగరంలో జనం భారీగా రోడ్లపైకి తరలివచ్చారు. వేల మంది పార్లమెంటు హౌస్‌ వద్ద నిరసన తెలిపారు. అయితే మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని ప్రభుత్వం వాదిస్తోంది.అమెరికాలో బూస్టర్‌ డోస్‌ ప్రారంభం..
వాషింగ్టన్‌: అమెరికాలో ప్రజలకు కొవిడ్‌ టీకా బూస్టర్‌ డోస్‌ను శుక్రవారం ప్రారంభించారు. శీతాకాలంలో కరోనా కేసులు పెరగకుండా ఈమేరకు చర్యలు చేపట్టారు. 50 ఏళ్లు పైబడిన వారు బూస్టర్‌ డోసు తప్పక తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇంతవరకు అమెరికాలో బూస్టర్‌ డోసు వేయడానికి సంబంధించి కొన్ని అంశాల్లో నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) కొత్త నిబంధనలను రూపొందించింది. ఈమేరకు 18 ఏళ్లు పైబడిన వారంతా ఫైజర్‌ లేదా మోడెర్నా టీకాకు 
సంబంధించి.. చివరి డోసు వేయించుకున్న 6 నెలల తర్వాత బూస్టర్‌ డోసు తీసుకోవచ్చు. ఒకే డోసుతో కూడిన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా విషయంలో బూస్టర్‌ డోసుకు 2 నెలల వ్యవధి సరిపోతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని