Published : 23/11/2021 14:51 IST

Covid: ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్న మహమ్మారి 

కొవిడ్‌ వేళ అణచివేతకు పాల్పడుతున్న పలు దేశాలు 
భారత్‌లో పరిస్థితిపైనా ఒకింత ఆందోళన 

కోపెన్‌హాగెన్‌: కొవిడ్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం పెను ముప్పును ఎదుర్కొంటోందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే క్రమంలో పలు దేశాల ప్రభుత్వాలు అప్రజాస్వామిక, అనవసర చర్యలకు ఉపక్రమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. 34 దేశాలతో కూడిన ‘ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెమోక్రసీ అండ్‌ ఎలక్టోరల్‌ అసిస్టెన్స్‌ (అంతర్జాతీయ ఐడీఈఏ)’ సంస్థ ఈ మేరకు 80 పేజీల నివేదికను సోమవారం విడుదల చేసింది. భారత్‌లో పరిస్థితిపైనా అందులో కొంత ఆందోళన వ్యక్తం చేసింది. 

తాజా నివేదికలోని ముఖ్యాంశాలివీ.. 

- కొవిడ్‌ వ్యాప్తిని నియంత్రించే క్రమంలో.. 2021 ఆగస్టు నాటికి ప్రపంచవ్యాప్తంగా 64% దేశాలు అనవసర, అనుచిత, అక్రమ చర్యలకు పూనుకున్నాయి. 

- ప్రజాస్వామ్యానికి ఆదరణ తగ్గుతున్న దేశాల సంఖ్య గత దశాబ్ద కాలంలో రెట్టింపయింది. అమెరికా, హం గేరీ, పోలండ్, స్లొవేనియా ఈ జాబితాలో ఉన్నాయి. 

- నిరంకుశ మార్గంలో పయనిస్తున్న దేశాల సంఖ్య.. గత ఏడాది ప్రజాస్వామ్య మార్గంలోని దేశాల సంఖ్యను దాటేసింది. మహమ్మారి వేళ 80 దేశాల్లో నిరసనలు కనిపించాయి. బెలారస్, క్యూబా, ఎస్వాతిని (స్వాజిలాండ్‌),మయన్మార్, సూడాన్‌లలో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమాలు అణచివేతకు గురయ్యాయి. 

- ఆసియాలోని అఫ్గాన్, హాంకాంగ్, మయన్మార్‌లలో నిరంకుశత్వం పెరిగింది. భారత్, ఫిలిప్పీన్స్, శ్రీలంకల్లో ప్రజాస్వామ్యాన్ని కొంత హరించడం కనిపించింది. చైనా ప్రాబల్యం ప్రజాస్వామ్యానికి మరింత ముప్పుగా మారుతోంది. 

- ఆఫ్రికాలో ప్రజాస్వామ్యానికి సంబంధించి గత మూడు దశాబ్దాల్లో సాధించిన ప్రగతి మహమ్మారి వేళ దాదాపుగా అంతరించిపోయింది. 

-  బొలీవియా, బ్రెజిల్, కొలంబియా, ఎల్‌ సాల్వడార్‌లో ప్రజాస్వామ్యం నిరాదరణకు గురవుతోంది. 

- ఐరోపాలో ప్రజాస్వామ్యం ఇప్పటికే బలహీనంగా ఉన్న కొన్ని దేశాలు కొవిడ్‌ను సాకుగా చూపుతూ అణచివేతను మరింత పెంచాయి. అజర్‌బైజాన్, బెలారస్, రష్యా, టర్కీ ఇందుకు ఉదాహరణలు.

ఆస్ట్రియాలో మళ్లీ లాక్‌డౌన్‌

పది రోజుల పాటు అమలు కరోనా నాలుగో దశ ఉద్ధృతే కారణం

వియెన్నా, బ్రసెల్స్‌: కొవిడ్‌ నాలుగో దశ ఉద్ధృతితో చివురుటాకులా వణుకుతున్న ఆస్ట్రియా... మళ్లీ దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధించింది! సోమవారం నుంచి పది రోజులపాటు ఇది అమలవుతుంది. వైరస్‌ విజృంభణ ఇలాగే కొనసాగితే, లాక్‌డౌన్‌ను మరిన్ని రోజులు పొడిగిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరించింది. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించింది. దేశంలోని చాలా ఆసుపత్రులు కొవిడ్‌ బాధితులతో కిటకిటలాడుతున్నాయి. 
*ఆస్ట్రియాలో ఇప్పటివరకూ 66% మంది టీకాలు తీసుకున్నారు. లాక్‌డౌన్‌ విధిస్తున్న క్రమంలో వీరందరికి ఛాన్సలర్‌ అలెగ్జాండర్‌ షాలెన్‌బర్గ్‌ క్షమాపణలు చెప్పారు. వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకే లాక్‌డౌన్‌ విధించాల్సి వచ్చిందన్నారు. 

ఫ్రాన్స్‌లో హింసాత్మకం.. నగరం లూటీ!

కొవిడ్‌ ఆంక్షలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌లోని గ్వాడెలోప్‌ ద్వీపంలో జరుగుతున్న నిరసనలు సోమవారం హింసాత్మకంగా మారాయి. పాయింట్‌-ఏ-పిట్రేలో చోటుచేసుకున్న ఘర్షణల్లో 80 ఏళ్ల వృద్ధురాలు సహా ముగ్గురు గాయపడ్డారు. అల్లరిమూకలు అనేక ఇళ్లను లూటీ చేశాయి. 38 మంది నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

బ్రసెల్స్‌లో వేలమంది...

కొవిడ్‌ ఆంక్షలను వ్యతిరేకిస్తూ బ్రసెల్స్‌లో భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. ఆదివారం నిర్వహించిన ర్యాలీలో సుమారు 35 వేల మంది పాల్గొన్నారు. వీరిలో కొందరు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని