omicron: మరిన్ని దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్‌

ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ మరిన్ని దేశాలకు విస్తరించింది. 

Published : 29 Nov 2021 13:11 IST

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా ఆందోళన రేకెత్తిస్తున్న కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ మరిన్ని దేశాలకు విస్తరించింది. తొలుత దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ వేరియంట్‌ జాడలు శనివారం పలు ఐరోపా దేశాల్లోనూ కనిపించాయి. బ్రిటన్, జర్మనీ, ఇటలీల్లో కొత్త వేరియంట్‌ కేసులు బయటపడ్డాయి. బెల్జియం, ఇజ్రాయెల్, హాంకాంగ్‌ దేశాల్లో కొందరు ప్రయాణికుల్లో ఈ వేరియంట్‌ బయటపడింది. ఆస్ట్రేలియాలో ఇద్దరికి, నెదర్లాండ్స్‌లో 13 మందికి ఈ వైరస్‌ సోకినట్లు తేలింది. అమెరికాలో ఇలాంటి కేసులు బయటపడనప్పటికీ.. ఇప్పటికే ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదని ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ చెబుతున్నారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్‌ సహా పలు దేశాలు మాస్కులు వంటి నిబంధనలను కట్టుదిట్టం చేయడంతో పాటు, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి. బ్రిటన్‌లో కొవిడ్‌ టీకా బూస్టర్‌ డోసును ప్రారంభిస్తున్నట్లు ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తెలిపారు. ఇప్పటికే దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, లెసోతో, ఏస్వటినా, బోట్స్‌వానాల నుంచి ప్రయాణికుల రాకపోకలపై నిషేధం విధించిన బ్రిటన్‌ ఆదివారం అంగోలా, మలావి, మొజాంబిక్, జాంబియాలను కూడా ఆ జాబితాలో చేర్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, కెనడా, జపాన్, ఇరాన్, థాయిలాండ్, సింగపూర్‌లతో పాటు ఐరోపా యూనియన్‌ దేశాలు కూడా పలు దక్షిణాది ఆఫ్రికన్‌ దేశాల నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని